ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్రమంత్రి రవిశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ సమాధానం ఇచ్చారు.
ఏపీ హైకోర్టును కర్నూలుకు తరలించాలని గతేడాది ఫిబ్రవరిలో సీఎం జగన్ ప్రతిపాదించారని మంత్రి గుర్తుచేశారు. అయితే హైకోర్టుతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపుల తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని చెబుతూనే కోర్టు తరలింపు కోసం ఎలాంటి గడువు లేదన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అలాగే హైకోర్టు నిర్వహణ, ఖర్చు బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయని, హైకోర్టు పరిపాలన మాత్రమే ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని మంత్రి గుర్తుచేశారు.
ఏపీలో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం.. న్యాయ రాజధానిగా కర్నూలు.. శాసన రాజధానిగా అమరావతిలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.