కుటుంబ నియంత్రణ పాటించాలని ప్రజలను బలవంతపెట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సంతానంపై పరిమితులు విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిపింది. జనాభా నియంత్రణపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై అఫిడవిట్ సమర్పించిన కేంద్రం, జనాభా నియంత్రణ కోసం బలమైన చట్టాలను అమలుచేయలేమని సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. కుటుంబ నియంత్రణ అన్నది దేశంలో వ్యక్తిగతం, స్వచ్ఛంధమే అని ప్రకటించింది.
ఎంతమంది పిల్లల్ని కనాలో దంపతులే నిర్ణయించుకోవాలన్న కేంద్రం, కుటుంబనియంత్రణపై ఎలాంటి ఒత్తిడి చేయలేమన్నది. ఒకవేళ నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే పిల్లలు ఉండాలని ప్రజలను బలవంతపెడితే ప్రతిఘటన రావొచ్చంది. ఇందుకు ప్రపందేశాల అనుభవాలను ఉదాహరణగా చూపించింది. అయితే మన దేశంలో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతోందని లెక్కలతో సహా సుప్రీం కోర్టుకు సమర్పించింది. 2000 సంవత్సరంలో సంతానోత్పత్తి రేటు 3.2శాతంగా ఉంటే 2018 నాటికి అది 2.2శాతానికి తగ్గిందని చెప్పింది. 2025 నాటికి సంతానోత్పత్తి రేటు 2.1శాతంగా ఉండేలా ప్రజలను చైతన్యపరుస్తామని చెప్పింది.