దేశంలో బర్డ్ ప్లూ ప్రభావం పౌల్ట్రీ వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. హైదరాబాద్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నగరంలో రోజుకు లక్ష కిలోల వరకు జరిగే చికెన్ అమ్మకాలు ప్రస్తుతం సగానికి సగం పడిపోయాయి. డిసెంబర్ నెల చివరి వరకు కిలోకి రూ.250 పలికిన చికెన్ ధర అమాంతం రూ.150కి పడిపోయింది.
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వల్ల ముందు ముందు చికెన్ ధరలు మరింత తగ్గిపోతాయని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. మామూలు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల నుంచి 5 లక్షల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతాయి. ఇందులో సుమారు 30 నుంచి 40 శాతం చికెన్ అమ్మకాలు హైదరాబాద్ లోనే జరుగుతాయి. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు లేకున్నా ప్రజలు చికెన్ తినడానికి ముందుకు రావడం లేదు.