భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న వివాదంపై తాజాగా చైనా రక్షణ శాఖ ప్రకటన చేసింది. తూర్పు లద్దాఖ్‌లో వివాదాలకు కేంద్రంగా ఉన్న పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా రక్షణ శాఖ మంత్రి చెప్పినట్లు చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. అదే సమయంలో భారత బలగాలు సైతం వెనక్కి వెళ్లిపోతున్నాయని చెప్పడం గమనార్హం. జనవరి 24న మాల్డో-చుశూల్ బార్డర్లో జరిగిన 9 రౌండ్ కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో చెప్పింది. దీనిపై భారత సైనికాధికారులు స్పందించేందుకు నిరాకరించారు. బహుశా రేపు పార్లమెంట్ లో రక్షణ మంత్రి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సౌత్ పాంగాంగ్ లేక్ నుంచి తగ్గించే ట్యాంకులు, సైనికుల విషయంలో మాత్రం స్పష్టత ఇయ్యలేదు.
ప్యాగాంగ్ లేక్ నార్త్, సౌత్ బ్యాంక్ లలో ప్రస్తుతం వివాదం నెలకొంది. గాల్వాన్ లోయ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో ఇరు దేశాలు తమ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో బలగాలను మోహరించాయి. కీలకమైన ఫింగర్ 8 నుంచి చైనా సైనికులు, నిర్మాణాలను తొలగించాలని గత కొన్నాళ్లుగా ఇండియా డిమాండ్ చేస్తుంది.