వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న పవన్ కల్యాణ్, ఆచార్య ప్రమోషన్స్ లో తలమునకలైన మెగాస్టార్ కలిసి ఓ ముచ్చట చెప్పనున్నారట. మెగా అభిమానులకు అన్నాదమ్ములిద్దరు కలిసి త్వరలోనే ఓ తీపి కబురు చెప్పనున్నారట. ఆచార్య ప్రమోషన్ తో చిరు, రానాతో కలిసి చేస్తున్న సినిమా ప్రమోషన్ తో పవన్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఎవరి పనిలో వారు బిజీగా ఉంటేనే వార్తల్లో నిండిపోయారు. అలాంటిది ఇద్దరూ కలిసి ఒకే పనిలో మునిగిపోతే రిజల్ట్ అదిరిపోతుంది కదా? అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. త్వరలో మెగాస్టార్ తమ్ముడు పవన్ కల్యాణ్ కి తోడుగా జనసేనలో క్రియాశీలకంగా పనిచేయనున్నాడట. ఈ మేరకు జనసేన పార్టీ క్రియాశీలక నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన చేశారు. ఈరోజు నిర్వహించిన జనసేన క్రియాశీలక సమావేశంలో నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ తో కలిసి చిరంజీవి జనసేన పార్టీ బాగోగులు చూడనున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి తాజాగా తమ్ముడు పెట్టిన జనసేన పార్టీలో చేరనున్నారని వార్త అటు అభిమానుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ సంతోషం నింపుతుంది.. ఇప్పటికే నాగబాబు జనసేన పార్ట్ తరఫున ఎంపీ గా పోటీచేశారు. చిరంజీవి రాకతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చి పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని.. నాదెండ్ల ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అంతేకాదు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకొండని ప్రభుత్వం బెదిరిస్తుందని ఆరోపించారు. జనసేన ఏకగ్రీవాలకు విరుద్ధమని ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలని అన్నారు. స్వచ్ఛమైన రాజకీయాల కోసం యువత రావాలంటే.. పంచాయతీ ఎన్నికల్లో యువత పోటీ చేయాలని ఆకాంక్షించారు.