అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తుంటే.. భారత్లో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. గత 24గంటల్లో దేశంలో 161 కరోనా మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాంతో మొత్తం మృతుల సంఖ్య 1,51,160కి చేరింది. కొత్త ఏడాదిలో మరోసారి కేసుల సంఖ్య 16వేలకు చేరుకుంది. నిన్న 6,59,209 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,311 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కోటి నాలుగు లక్షల మందికి పైగా వైరస్ సోకింది.
దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2,22,526గా ఉండగా.. ఆ రేటు 2.13కి తగ్గింది. రికవరీ రేటు 96.43 శాతానికి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,00,92,909 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, ఈ నెల 16న ప్రారంభంకానున్న టీకా కార్యక్రమంపై సమీక్షించేందుకు ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.