క్యాన్సర్ ఆ మాట వింటేనే జనం వణికిపోతారు. పరీక్షల నుంచి ట్రీట్మెంట్ వరకు వేలకు వేలు ఖర్చుపెట్టాల్సిందే. అయితే తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలతో క్యాన్సర్ రోగులకు వైద్యం ఉచితంగా అందుతోంది. ఎంఎన్‌జేతోపాటు నిమ్స్ హాస్పిటల్ లో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో కార్పొరేట్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి
రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద క్యాన్సర్ ఆస్పత్రి ఎంఎన్‌జే. ఇది స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఇక్కడ మెరుగైన వైద్యసేవలు ప్రజలకు అందుతున్నాయి. 450 బెడ్లు కలిగిన ఈ హాస్పటిల్‌లో ఏటా 15 వేల మంది కొత్తపేషెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటారు. క్యాన్సర్‌కు సంబంధించి 2 వేల 500 మేజర్, మైనర్ సర్జరీలు ఇక్కడ జరుగుతాయి. నిత్యం 400 మందికి రేడియేషన్, 350 మందికి కీమోథెరపీ ట్రీట్ మెంట్ అందిస్తారు. తెలంగాణ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు.
ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలు రాష్ట్రంలో మరే ఆస్పత్రిలోనూ లేవు. క్యాన్సర్ నిర్థారణ, ట్రీట్మెంట్కు అవసరమైన అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ట్రూబీమ్ లీనియర్ యాక్సిలరేటర్, పెట్ సీటీస్కాన్, 1.5 టెస్లా ఎంఆర్ఐ, 128 స్లైస్ సీటీస్కాన్, కలర్ డాప్లర్, డిజిటల్ మమోగ్రఫీ, సీటీ స్టిములేటర్, ఆర్టీ స్టిములేటర్, స్పీడ్ గమ్మా కెమెరాతోపాటు అత్యాధునిక ల్యాబ్ ఇక్కడ ఉంది.
నిమ్స్ ఆస్పత్రి
నిమ్స్‌లో క్యాన్సర్ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జెహెచ్ఎస్తోపాటు సీఎంరిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా ట్రీట్ మెంట్ చేస్తున్నారు. దీంతో గతంలో కార్పొరేట్ హాస్పిటల్లకు వెళ్లే ఉన్నత వర్గాలవారు సైతం నిమ్స్‌కు క్యూ కడుతున్నారు. సాధారణంగా కీమోథెరపీకి అవసరమయ్యే ఒక్క ఇంజక్షన్ ధర 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. అలాంటి ఖరీదైన మందుల్ని సైతం ఉచితంగా అందిస్తున్నారు.
నిమ్స్‌లో క్యాన్సర్ పేషెంట్స్ కు స్టెమ్ సెల్ ట్రీట్ మెంట్ కూడా అందుబాటులో ఉంది. బోన్ మారోట్రాన్స్ ప్లాంటేషన్‌కు సంబంధించి ఆటోలాజాస్, అలోజెనోట్రీట్ మెంట్లు ఇక్కడ ఇస్తున్నారు. ఈ వైద్యానికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంత ఖరీదైన వైద్యాన్ని సైతం నిమ్స్‌లో ఉచితంగా అందిస్తున్నారు. గతంలో మనిషి నుంచి సెల్స్ తీసేందుకు ప్రయాసపడాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక పరికరం సాయంతోస్టెమ్ సెల్స్‌ను సేకరించి తిరిగి రక్తాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేసే అవకాశం ఏర్పడింది.
నిమ్స్ ఆస్పత్రి క్యాన్సర్ విభాగంలో గతంలో అరకొర వసతులుండేవి. టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధునాత పరికరాలు అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ అంకాలజీ విభాగం మెడికల్, సర్జికల్, రేడియేషన్ విభాగాలుగా పనిచేస్తోంది. వీటికి అనుబంధంగా క్యాన్సర్ రేడియాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగాలు వ్యాధిని గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. వీటన్నింటినికూడా ఆధునికీకరించడంతో అన్నిరకాల అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేశారు.
నిమ్స్‌లో ఉన్నల్యాబ్లో క్యాన్సర్ కు సంబంధించి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించే వెసులుబాటు ఉంది. అత్యంత ఖరీదైన న్యూక్లియర్ స్కాన్లను సైతం నిమ్స్‌లో ఏర్పాటు చేశారు. క్యాన్సర్ కణజాలం ఎంత చిన్నగా ఉన్నా గుర్తించే విధంగా పెట్ స్కాన్, బోన్ స్కాన్ సౌకర్యాలు కూడా నిమ్స్‌లో అందుబాటులో ఉన్నాయి.
రోగులు సంతోషం
ఖరీదైన ట్రీట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండటంపై రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చి మెరుగన వైద్యం అందిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వ సంకల్పం, చిత్తశుద్ధి క్యాన్సర్ రోగులకు వరంగా మారింది. పేషెంట్లకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందుతోంది.