29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

దేహమేరా రామాలయం

తెలంగాణ, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని జంజీర్ చపా, సారంగడ్ జిల్లాల దండకారణ్యంలో నివసించే రామనామి తెగకు శ్రీరాముడంటే అమితమైన భక్తి, విశ్వాసం. ఎస్సీ వర్గానికి చెందిన ఈ తెగకు రామనామమే తారకమంత్రం. గత రెండు శతాబ్దాల నుంచి రాముడికి తమ దేహాలనే అంకితమిచ్చి.. ఆపదామస్తకం రామ నామాన్ని పచ్చబొట్టుగా వేయించుకోనవడం ఈ తెగ సంప్రదాయం.  రామునిపై వీరికున్న అమితమైన భక్తి మూలంగానే ఈ తెగకు రామనామిగా పేరు స్థిరపడింది.

దేవుడంటే సర్వాంతర్యామి అని ఆదిశంకరులు సంధించిన అద్వైత సిద్ధాంతం రామనామి తెగకు ప్రాణం పోసింది. ఆలయంలోనే దేవుడు ఉంటాడనే సిద్ధాంతానికే ఈ తెగ విరుద్ధం. శ్రీరాముడిని ఇంత గొప్పగా ఆరాధించే ఈ తెగ.. ఎక్కడా ఆలయం మాత్రం నిర్మించకపోవడం విశేషం. ఈ కారణంగానే ఈ తెగలో ఎక్కడా ఆలయాలు, విగ్రహారాధనలు కన్పించవు. ఏడాది పొడవునా మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు.

ఏటా జనవరిలో 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు పెద్దయెత్తున జాతర నిర్వహించడం రామనామి ప్రజల ఆనవాయితీ. ఈ జాతరకు సైతం ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. 1911లో భారీ వర్షాల కారణంగా రామనామి తెగకు చెందిన ప్రజలు ఒక దగ్గర చిక్కుకుపోగా.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని పడవలో దాటాల్సిన తరుణంలో శ్రీరాముడిని భక్తితో వేడుకున్నారట. సురక్షితంగా ఒడ్డుకు చేర్చితే ఏటా జాతర నిర్వహిస్తామని మొక్కుకున్నారట. రాముని మహిమ వల్లే తమ పూర్వీకులు సురక్షితంగా నదిని దాటడంతో నాటి నుంచి జాతర నిర్వహిస్తున్నారని వీరి నమ్మకం. ఈ ఏడాది కూడా సారంగడ్ జిల్లా నాందిలిలో రామనామి జాతరను వైభవంగా నిర్వహించారు.

సారంగడ్ జిల్లా నాందిలిలో అఖిల భారత రామానామి భజన మేళా ఆధ్వర్యంలో జరిగే రామనామి మేళాకు ఏటా లక్షల సంఖ్యలో రామభక్తులు తరలివస్తారు. చత్తీస్ ఘడ్ సీఎం ముఖ్య అతిథిగా హాజరై జాతరను ప్రారంభించడం సంప్రదాయం. ఈ జాతరలోనే రామనామి తెగకు చెందిన యువతీ, యువకులకు ఈ మేళా సందర్భంగా పెండ్లిలు చేస్తారు. ఈ జాతరను చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా టూరిస్టులు తరలివస్తారు.

- Advertisement -

Latest news

Related news