రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో హింసకు కారణమైన నటుడు దీప్ సిద్ధూ, మరో ముగ్గురి ఆచూకీ చెప్పిన వారికి.. రూ.లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఎర్రకోట వద్ద జరిగిన హింసలో ఆరోపణలు ఎదుర్కుంటున్న దీప్ సిద్ధూ, జగ్ బీర్ సింగ్, బూటా సింగ్, సుఖదేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ మీద పోలీసులు రివార్డు ప్రకటించారు.
జనవరి 26న జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు దీప్ సిద్ధూనే కారణమని, శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రైతులను రెచ్చగొట్టి ఎర్రకోటవైపు వెళ్లేలా ఆయనే రెచ్చగొట్టారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి లుకవుట్ నోటీసులు జారీ చేశారు. ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేయడమే కాక.. జెండాలు ఎగురవేయడాన్ని సమర్థిస్తూ ఫేస్బుక్లో పోస్టులు చేశాడన్న నేరంతో సిద్ధూ మీద కేసు నమోదు చేశారు. అయితే.. ఆ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచి సిద్ధూ కనిపించడం లేదు. ఈ ఘటనకు సంబంధం ఉన్నందున ఢిల్లీ పోలీసులు సిద్ధూ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ ఎర్రకోట ఉద్రిక్తతలకు కారకులుగా భావిస్తోన్న 12 మంది చిత్రాలను సైతం విడుదల చేశారు. ఆ 12 మంది చేతిలో కర్రలు, లాఠీలు ఉన్నట్లు పోలీసులు విడుదల చేసిన చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎర్రకోట ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 44 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి.. 122 మందిని అరెస్టు చేశారు. ఆ హింసలో ఓ యువరైతు మృతికి సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో కొందరు జర్నలిస్టులు, విపక్ష పార్టీ నేతలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
