29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

శవాన్ని మోసిన మహిళా ఎస్సై శిరీష ఎవరో తెలుసా?

గుర్తు తెలియని మృతదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసిన ఎస్సై శిరీష అందరి మన్ననలు పొందిన ఘటన అందరికీ తెలిసిందే. ఊరికి దూరంగా వ్యవసాయ పొలాల్లో గుర్తు తెలియని మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీస్ స్టేషన్ కి ఫోన్ రాగానే.. ఎస్సై శిరీష వెంటనే అక్కడికి వెళ్లింది. చుట్టూ చాలామంది ఉన్నా శవాన్ని తీసేందుకు, మోసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చేసేదేం లేక తానే.. రంగంలోకి దిగింది. స్ట్రెచర్ మీద శవాన్ని పడుకోబెట్టి భుజాలపై మోస్తూ.. జీపు దగ్గరికి తీసుకెళ్లింది. ఇంతకీ ఈ శిరీష ఎవరు? ఎందుకలా చేసింది?
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవి కొత్తూరు గ్రామ సరిహద్దుల్లోని పొలాల్లో గుర్తు తెలియని శవం.. కుల్లిపోయిన స్థితిలో ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం ఉన్నచోటికి వెళ్లేందుకు దారి లేదు. పొలాలు, బురదలోంచి నడుచుకుంటూ వెళ్లాలి. జీపు అక్కడే వదిలేసి కానిస్టేబుల్, హోంగార్డుతో కలిసి శిరీష అక్కడికి చేరుకుంది. మృతదేహం బాగా కుళ్లిపోయింది. గుర్తు పట్టేందుకు కూడా వీల్లేదు. దాదాపు 70 ఏళ్లుంటాయి కావచ్చు. స్థానికులను, రైతులను విచారించినా.. మృతదేహం గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. కుళ్లిపోయిన మృతదేహం నుంచి వాసన భరించలేక అక్కడ ఉండేందుకు కూడా ఎవరూ ఇష్టపడలేదు. కానిస్టేబుల్స్ కూడా శవాన్ని తరలించేందుకు ఇబ్బంది పడ్డారు. చేసేదేం లేక.. కాశీబుగ్గకు చెందిన లలితా ఛారిటబుల్ ట్రస్ట్ కి ఫోన్ చేసింది. వారు తెచ్చిన స్ట్రెచర్ మీద ఆ మృతదేహాన్ని ఉంచి.. తన భుజాలపై మోసుకుంటూ.. పొలం గట్ల మీద, బురదలోంచి నడుచుకుంటూ జీపు దగ్గరికి తీసుకొచ్చింది. ఆ ట్రస్ట్ వారికి మృతదేహాన్ని అప్పగించి.. అంత్యక్రియల కోసం కొంత నగదు ఇచ్చి పంపింది.
ఎందుకు చేసిందంటే..
ఎవరినైనా కూలీలను పెట్టి తరలించొచ్చు కదా.. తానే స్వయంగా ఎందుకు మోసింది అనే డౌట్ చాలామందికి రావచ్చు. శిరీష మాత్రం.. ఇదంతా పార్ట్ ఆఫ్ మై డ్యూటీ. ఇటీ ఈజ్ పార్ట్ అండ్ పార్శిల్ ఆఫ్ పోలీస్ డ్యూటీ అంటారామె. ఎన్నో యాక్సిడెంట్ కేసులలో.. స్పాట్ లో గాయాల పాలైన వారిని స్వయంగా పోలీస్ జీపులో వేసుకొని.. ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్ మెంట్ చేయించారు. సమయానికి తీసుకురావడం వల్ల ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా చనిపోయేవారు అని డాక్టర్లు చెప్తున్నప్పుడు మనసుకు ఏదో తెలియని సంతృప్తి అంటోంది శిరీష. చాలాసార్లు యాక్సిడెంట్ స్పాట్ లో ముక్కలు ముక్కలుగా పడిపోయిన శరీర భాగాలను సంచిలో తీసుకొని ఆస్పత్రికి వెళ్లిన రోజులు కూడా ఉన్నాయంటోంది ఆమె. శాంతి భద్రతలను కాపాడడం మాత్రమే కాదు. ప్రజల ప్రాణాలను కాపాడడం కూడా మా డ్యూటీనే కదా అని సమాధానమిస్తున్నది.
శిరీష గుణం ఎలాంటిదంటే..
2019లో నాకు శిరీష నందిగామలో ఎస్సైగా ఉద్యోగంలో చేరింది. అదే ఊరికి చెందిన ఓ కుటుంబంలో నలుగురు కొడుకులు తల్లిదండ్రులను గొడ్లపాకలో పారేశారు. వాళ్లకు చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో మార్పు రాలేదు. తన సొంత ఖర్చులతో ఆ తల్లిదండ్రులకు రేకుల షెడ్డు వేసి గూడు కల్పించింది. ఇలా ఆపదలో ఉన్నవారికి.. కష్టాల్లో ఉన్నవారికి తనవంతు బాధ్యతగా సాయం చేసేది. పోలీస్ ఉద్యోగం చేరిన నాడే.. సమాజం కోసం పని చేయాలి. ప్రజల కోసం పని చేయాలి అందుకే విధి నిర్వహణలో దేన్నీ లెక్కచేయను అంటోంది. ఎస్సై కావడం కంటే ముందు శిరీష కానిస్టేబుల్. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన శిరీష డిగ్రీ పూర్తవగానే.. 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. మద్దిరాలపాలెం ఎక్సైజ్ ఎస్పీ ఆఫీసులో ఏడాదిన్నర పాటు విధులు నిర్వహించింది. ఆ తర్వాత ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టింది. ఎస్సైకి ప్రిపేరయింది. తొలి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగం సాధించింది. శ్రీకాకుళం జిల్లాలోని నందిగామలో తొలి పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జి.సిగడాంలో విధులు నిర్వహించింది. తాజాగా కాశీబుగ్గకు బదిలీ అయిన శిరీష.. తన మానవత్వంతో అందరి మనసులు గెలుచుకుంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసిన శిరీష ఏనాడూ ప్రచారం కోరుకోలేదు.. చేసుకోలేదు. మొన్న అనాథ శవాన్ని మోస్తున్నప్పుడు కూడా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో శిరీష మంచి మనసు అందరికీ తెలిసింది. శవం అనగానే.. ఎవరి సెంటిమెంట్లు వారికుంటాయి. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేనే చొరవ తీసుకొని.. శవాన్ని జీపు వరకు మోసి అంత్యక్రియలకు పంపిచాను అని చెప్పింది శిరీష.

- Advertisement -

Latest news

Related news