కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చేతుల మీదుగా డీఐజీ సుమతి ఉత్తమ కరోనా వారియర్ అవార్డు అందుకున్నారు. జాతీయ మహిళా కమిషన్ 29వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి చేతుల మీదుగా ఆమె అవార్డు స్వీకరించారు. కరోనా, లాక్ డౌన్ సమయంలో విశేష సేవలందించిన పలువురు మహిళలు, అధికారులను ఎంపిక చేసి మహిళా కమిషన్ ప్రత్యేక పురస్కారాలను అందచేసింది. ఈ అవార్డుకు తెలంగాణ పోలీస్ శాఖ నుంచి డీఐజీ సుమతి ఎంపికయ్యారు.
లాక్ డౌన్ సమయంలో ప్రజలకు నిత్యావసర వస్తువులు, మందులు, రవాణా తదితర అవసరాలకు ఏవిధమైన లోటు రాకుండా తెలంగాణ పోలీస్ శాఖ ద్వారా డీఐజీ సుమతి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రభుత్వ శాఖలతో పాటు దాదాపు 90 స్వచ్ఛంద సంస్థల సహాయంతో నిత్యావసర వస్తువులు, మందులను ప్రజలకు ప్రధానంగా వలస కూలీలకు అందించడంలో ఆమె కీలక పాత్ర వహించారు. కొవిడ్ నియామావళిని కట్టుదిట్టంగా అమలు చేయడం, వైద్యులు, వైద్య సిబ్బంది 24 /7 అందుబాటులో ఉంచేందుకు రూపొందించిన సేవా యాప్ ను సమర్థవంతంగా ఉపయోగించడంలో సుమతి కీలకపాత్ర వహించారు. లాక్ డౌన్ సమయంలో గృహహింసపై డయల్ 100కు వచ్చిన ఫోన్ కాల్స్ కు సత్వరమే స్పందించేందుకు 24 మంది సైకాలజిస్టులను నియమించి ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు.
