జనవరి 16న ప్రారంభం కానున్న మొదటి దశ వ్యాక్సినేషన్లో భాగంగా దేశ వ్యాప్తంగా 3 కోట్ల మంది హెల్త్, ఫ్రంట్ లైన్ వర్కర్లుకి వ్యాక్సిన్లు వేస్తామని, దీనికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఇవాళ పలువురు సీఎంలతో ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. చాలా సరసమైన ధరల్లో రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఒకవేళ విదేశీ టీకాలపై ఆధారపడి ఉంటే, దేశంలో పరిస్థితి మరోలా ఉండేదన్నారు. రెండో దశలో 50 ఏళ్లు దాటిన వారికి, వ్యాధులు ఉన్న 50 ఏళ్ల లోపు వారికి టీకాలు ఇవ్వనున్నారు.
రానున్న కొన్ని నెలల్లో సుమారు 30 కోట్ల మందికి టీకాలను ఇచ్చేందుకు ప్రణాళిక చేసినట్లు మోదీ తెలిపారు. వ్యాక్సినేషన్ అంశంలో రియల్ టైమ్ డేటా చాలా కీలకమైందని ప్రధాని అన్నారు. విశ్వసనీయ పద్ధతిలోనే కోవిడ్ టీకాలకు ఆమోదం ఇచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. యూనివర్సల్ ప్రోటోకాల్స్ ప్రకారమే శాస్త్రవేత్తల వర్గం ఆ రెండు టీకాలకు పచ్చజెండా ఊపినట్లు ప్రధాని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవీషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాలను కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే.