విలయాలను ముందుగానే పసిగట్టే శక్తి చేపలకు ఉందా.. విలయాల రాక చేపలకు ముందే తెలిసిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. ఆదివారం ఉత్తరాఖండ్లో నందాదేవి గ్లేసియర్ చరియలు విరిగిపడటంతో ధౌలిగంగ నది ఎంతటి విలయం సృష్టించిందో తెలుసు కదా. ఈ విలయానికి సరిగ్గ గంట ముందు ధౌలిగంగకు 70 కిలోమీటర్ల దూరంలోని అలకనంద నదిలో ఓ వింత చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలకనంద నదిలో వలలు అవసరం లేకుండానే చేపలు చేతికి అందడంతో సమీప గ్రామాల్లోని వారు వచ్చి చేపలను పట్టుకుపోయారు. ఇలా గతంలో ఎప్పుడు జరగలేదని స్థానికులు అంటున్నారు. ఇలా చేపలు ఎందుకు ప్రవర్తిస్తాయనే విషయంపై వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని సీనియర్ సైంటిస్టు శివకుమార్ స్పందించారు. చేపలకు ఉండే పార్శ్వ రేఖా అవయవాల ద్వారా నీళ్లలో కదలికలు, ఒత్తిడిలో మార్పును స్పష్టంగా గుర్తిస్తాయట. ప్రమాదాన్ని ముందే గ్రహించే చేపలు ఒడ్డుకు లేదా నీటి పైభాగానికి వస్తాయన్నారు. ధౌలిగంగ విలయం కంటే ముందు వచ్చిన శబ్దాలను చేపలు ముందే గ్రహించి అలా ప్రవర్తించి ఉండొచ్చని ఆయన అంచనా వేశారు.