గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే ఉద్యోగుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచనలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా.. శానిటైజర్, మాస్క్ లు సరఫరా చేయాలని కోరింది. ఫ్రంట్ లైన్ వారియర్స్‌తో పాటు పోలింగ్‌లో పాల్గొనే సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని పేర్కొంది. పోలింగ్‌లో పాల్గొనే సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.
ఎన్నికల నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి.. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అప్రజాస్వామికమని, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఏపీ ఎలక్షన్ కమీషన్ ను కోరారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని పలుదఫాలుగా ఎన్నికల కమీషనర్ కి తెలియజేసామన్నారు. సీఎస్ కూడా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పినా ఈసీ మొండిగా ముందుకెళ్తుందన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రై రన్ జరుగుతొందని, స్ట్రెయిన్, బర్డ్ ఫ్లూ లాంటివి ప్రబలుతున్న కారణంగా ఎన్నికలు నిలుపుదల చేయాలన్నారు. ఎన్నికల కమిషనర్ ఉద్యోగుల ప్రాణాలకు భద్రత కల్పిస్తారా అని ప్రశ్నించారు. ఈసీ మొండిగా ముందుకు సాగితే న్యాయపోరాటానికి దిగుడంతోపాటు ఎన్నికల విధులు బహిష్కరించేందుకు వెనుకాడబోమన్నారు.
ఒక వ్యక్తి ఇగో కోసం.. మా ప్రాణాలు పణంగా పెట్టలేం..
కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ పాల్గొనలేరని, ఒక వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇబ్బంది పెడితే కోర్టుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎవరో తరుముతున్నట్టు.. ఇంత హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.