రైతు ఉద్యమంలో పాల్గొంటున్న ఓ రైతు కేంద్ర వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకున్నాడు. రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే కలత చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు.
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంలో జింద్ గ్రామానికి చెందని 52 ఏండ్ల కరమ్‌వీర్‌సింగ్ చురుగ్గా పాల్గొంటున్నాడు. కొన్ని రోజులుగా టిక్రీలోనే ఉంటున్నాడు. గత 74 రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల ఆయన కలత చెందాడు. టిక్రీ బైపాస్‌లోని కొత్త బస్ స్టాండ్ సమీపంలో చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సివిల్ దవాఖానకు తరలించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జింద్ గ్రామంలోని ఆయన కుటుంబీకులకు సమాచారం అందించారు. రైతుల డిమాండ్లను కేంద్రం నెరవేర్చకపోవడంతో కరమ్‌వీర్ సింగ్ కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడని.. రైతులు తెలిపారు. కరమ్‌వీర్ సింగ్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
