కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 18వ రోజుకు చేరుకుంది. దిల్లీ నుంచి వివిధ నగరాలకు వెళ్లే రోడ్లను దిగ్బంధిస్తమని రైతులు ప్రకటించడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశిర్రు. ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరించిర్రు. రహదారుల దిగ్బంధంలో భాగంగా ఇయ్యాల ఢిల్లీ-జయపుర మార్గంలో బైఠాయించేందుకు రైతులు సిద్ధమైతున్నరు. ఇప్పటికే ఢిల్లీ-జయపురం రోడ్డులో పోలీసులు భారీగా మొహరించిర్రు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రత్యామ్నయ ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపిర్రు. ఇతర సరిహద్దు ప్రాంతాల్లోనూ బలగాల్ని అప్రమత్తం చేశిర్రు.
మరోవైపు రాజస్థాన్లోని షాజహాన్పుర్ నుంచి జయపుర-ఢిల్లీ జాతీయ రహదారి మీదుగా వేల సంఖ్యలో ట్రాక్టర్లతో ఆదివారం ‘చలో ఢిల్లీ’ యాత్రను నిర్వహించేందుకు రైతులు సిద్ధమైతున్నరు. ఇప్పటికే భారీ సంఖ్యలో రైతులు షాజహాన్పుర్కు చేరుకున్నరు. సాయంత్రానికి మరికొంత మంది వచ్చి చేరుతరని.. అందరం కలిసి ర్యాలీని ప్రారంభిస్తమని అక్కడి రైతు సంఘాల నేతలు చెప్పిర్రు. మరోవైపు రైతులకు ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇస్తున్నయ్.
సోమవారం నాడు సింఘు సరిహద్దులో రైతు నేతలంతా నిరాహార దీక్ష చేస్తరని, దేశవ్యాప్త నిరసనల్లో రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటరని రైతు సంఘం నాయకులు తెలిపిర్రు. ఈ నెల 19లోగా ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించర్రు. ఉద్యమాన్ని నీరుగార్చాలని సర్కారు ప్రయత్నిస్తున్నా.. అది అసాధ్యమని తేల్చిచెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా తమకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో ఉద్యమ విస్తరణ ఖాయమని స్పష్టంచేశిర్రు.