29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

బీజేపీకి చెమటలు పట్టిస్తున్న రైతు ఉద్యమం

జెండావందనం నాడు ఎర్రకోట ముంగట జరిగిన పలు హింసాత్మక ఘటనల తర్వాత రైతు ఉద్యమాన్ని సల్లగ చేయొచ్చని మోడీ సర్కార్ పావులు కదిపింది. రైతు ఉద్యమ నాయకులకు నోటీసులిచ్చుడు.. బలవంతంగా గుడారాలు ఖాళీ చేపిచ్చుడు.. ఇంటర్నెట్, మంచినీళ్లు బంద్ పెట్టి ఎట్లనైనా ఉద్యమాన్ని ఊడ్చేద్దామనుకున్నది. కానీ సీన్ ఉల్టా అయింది. రైతు నేత రాకేష్ టికాయత్ ఏడ్సుకుంట పెట్టిన వీడియో.. లక్షల మందిని కదిలించింది. ఢిల్లీ వదిలి వెళ్లిపోయిన రైతులు భార్యాపిల్లలతో ఆందోళన కేంద్రాల దగ్గరికి వచ్చేలా చేసింది. ఇప్పటి దాకా పంజాబ్, హర్యాణా రైతులు మాత్రమే చేసిన ఉద్యమం ఉత్తర భారతమంతా వ్యాపించింది. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాలకు పాకింది. ఊర్లకు ఊర్లే.. తీర్మానాలు చేసుకొని ఢిల్లీ సరిహద్దుల కాడికి వస్తున్నరు. ఇంటికొక్కరు చొప్పున రైతు ఉద్యమంల పాల్గొనాలె. చట్టాలు రద్దైన తర్వాతనే.. తిరిగి ఇంటికి రార్రి అని మహిళలు వీర తిలకాలు దిద్ది మరీ.. రైతులను ఉద్యమ బాట వైపు పంపిస్తున్నరు. ఫిబ్రవరి 2 తారీఖు నాడు ఢిల్లీ సరిహద్దుల రైతులు నిర్వహించ తలపెట్టిన భారీ మోహరింపు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా రైతులు, యువకులు పోటెత్తి వస్తున్నరు. మొన్నటి వరకు.. టిక్రీ, సింఘులు మాత్రమే రైతుల ఉద్యమానికి కేంద్రాలుగా ఉండేవి. ఇప్పుడు గాజీపూర్, ఇతర రాష్ట్రాల ఢిల్లీ సరిహద్దులు సైతం.. రైతు ఉద్యమ కేంద్రాలుగా మారిపోయినయ్. హర్యాణా, పంజాబ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంటర్నెట్ బంద్ పెట్టి.. ఉద్యమ వార్తలు ప్రచారం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నయ్. అయినా ఉద్యమం ఉధృతి మాత్రం అంతకంతకు డబుల్ అయితున్నది.
రైతుల ఉద్యమం కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిచ్చిందన్న ముచ్చట అందరికీ తెల్సిందే. అయితే.. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో జాట్ లు రైతు ఉద్యమానికి సపోర్ట్ పలుకుతున్నరు. పెద్ద ఎత్తున రైతుల ఉద్యమానికి మద్దతిస్తూ.. ప్రత్యక్ష ఉద్యమంలోకి దిగిర్రు. జాట్ యువత ఎక్కడ ఉన్నా సరే.. ఢిల్లీకి చేరుకోవాలె.. ఎక్కడిక్కడ జరిగే రైతు ఉద్యమాల్లో, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలె.. అని జాట్ నాయకులు ప్రకటించుడు తోటి… జాట్ లంతా ఏకమై.. జై కిసాన్ అని నినదిస్తున్నరు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల కొట్లాటకు.. జాట్‌ ల పోరాటం కూడా జత కల్సుడుతోటి .. రైతుల ఉద్యమానికి కొత్త ఊపొచ్చింది.
నిన్నటి దాకా.. ఆందోళన కార్యక్రమాలల్ల పంజాబ్, హర్యాణా రైతులు 80%మంది ఉండేది. 20% ఉత్తర్‌ప్రదేశ్‌ రైతులు కనవడేటోళ్లు. కానీ.. ఇప్పుడు ఢిల్లీల సీన్ మొత్తం మారిపోయింది.ఒక్క ఉత్తర ప్రదేశ్ కెల్లే దాదాపు 80శాంత మంది రైతులు ఉద్యమంలకి వచ్చిర్రు. జాట్ ల మెజార్టీ ఎక్కువగా ఉన్న పశ్చిమ యూపీ అంతట రైతు ఉద్యమ వేడి వ్యాపించింది. ఇంకో ఏడాది తర్వాత యూపీలో ఎన్నికలు ఉండుడు, అక్కడ జాట్ ల మెజారిటీ ఎక్కువ ఉండుడు వల్ల మోడీ సర్కార్ కి గొంతులో పచ్చి వెలగ్గాయ పడ్డట్టయింది. అటు చట్టాలు రద్దు చేసుడు కుదరదు అని గట్టిగ చెప్పలేదు. ఇటు చట్టాలు రద్దు చేస్తున్నం అని ఒప్పుకునుడు కూడా కుదరదు. మింగలేక.. కక్కలేక మోడీ సర్కార్ నెత్తి పట్టుకొని కూసున్నది.

- Advertisement -

Latest news

Related news