29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత.. బారికేడ్లు బద్దలుకొట్టిన అన్నదాతలు

పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. లక్షలాది మంది రైతులు వేలాది ట్రాక్టర్లతో దేశ రాజధాని సరిహద్దులో కదం తొక్కారు. ట్రాక్టర్లతో ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా వాటన్నింటిని దాటుకొని రైతులు ఢిల్లీ వైపు అడుగులు వేశారు. రైతులను నిలువరించే క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్తతలకు దారితీసింది. రైతులు రాకుండా బారికేడ్లతో పోలీసులు నిర్మించిన అడ్డుగోడను దాటుకుంటూ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.

అయితే.. రాజ్‌ప‌థ్‌లో గ‌ణతంత్ర వేడుక‌లు ముగిసిన త‌ర్వాత రైతులు ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉద‌యం 8గంట‌ల‌ నుంచే ఆందోళన మొదలుపెట్టారు. స‌రిహ‌ద్దులు దాటి ఢిల్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డు చెప్పడంతో సింఘు, టిక్రీ సరిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పాండ‌వ్ న‌గ‌ర్ ద‌గ్గర్లో ఢిల్లీ, మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ వైపు పోలీసులు పెట్టిన బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో తొక్కించారు. ముక‌ర్బా చౌక్‌లో పోలీసులకు, రైతులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సంజ‌య్‌గాంధీ ట్రాన్స్‌పోర్ట్ న‌గ‌ర్‌లో పోలీసులు, రైతుల మ‌ధ్య వాగ్వాదం ఏర్పడింది. కొన్నిచోట్ల రైతులకు స్థానికులు పూలతో స్వాగతం పలకగా.. పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొన్నిచోట్ల ట్రాక్టర్ ర్యాలీ ఢిల్లీ వైపు రాకుండా బస్సులను అడ్డంగా పెట్టారు. దీంతో రైతులు వాటిని ధ్వంసం చేస్తూ ముందుకు సాగారు.

- Advertisement -

Latest news

Related news