29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సిందే అంటూ రైతులు ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ రణతంత్రంగా మారింది. రాజ్‌పథ్‌లో అధికారిక గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాతే మధ్యాహ్నం 12 గంటలకు రైతుల ట్రాక్టర్ల కవాతు ప్రారంభమవుతుందని సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించింది. ర్యాలీ ఎట్టి పరిస్థితిలో సెంట్రల్‌ ఢిల్లీలోకి ప్రదర్శన ప్రవేశించదని స్పష్టంగా చెప్పింది. అయితే.. కొంతమంది రైతులు మాత్రం ఉదయం ఏడు గంటలకే ర్యాలీ ప్రారంభించారు.
సింఘు, టిక్రీ, గాజీపుర్‌ల వద్దకు ట్రాక్టర్లతో చేరుకున్న వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. టిక్రీ, సింఘు సరిహద్దుల వద్ద ఉన్న బారికేడ్లను ధ్వంసం చేశారు. కొంతమంది రైతులు తమను అడ్డుకుంటున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. రైతులంతా సంయమనంతో ర్యాలీ కొనసాగించాలని.. హింసాత్మక ఘటనలకు తావివ్వకూడదని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు.

ఉదయం పది గంటలకు సంజయ్ గాంధీ ట్రాన్స్ పోర్ట్ నగర్ వద్ద నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ర్యాలీగా వెళ్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పదిన్నర గంటలకు అక్షరధామ్ కూడలి వద్ద పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ.. రైతులు ఘర్షణకు దిగారు. రోడ్డు మీద నిలిపి ఉంచిన వాహనాలు, డీటీసీ బస్సులను ధ్వంసం చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగంతో పాటు.. పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు. వారి సంప్రదాయం ప్రకారం తమ వెంట పొడవాటి కత్తులు తెచ్చుకున్న కొంతమంది రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతులిచ్చిన రోడ్డులో కాకుండా.. సరై కలేఖాన్ మార్గం వైపు రైతులు ర్యాలీని మళ్లించారు.

మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ముకర్బా చౌక్‌ వద్ద రైతులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందిద. మరోవైపు సెంట్రల్ ఢిల్లీ ఐటీవో చౌరస్తాకు చేరుకున్న రైతులు.. డీటీసీ బస్సులను ధ్వంసం చేశారు. అడ్డుకోడానికి వచ్చిన పోలీసులను తరిమి కొట్టారు. ట్రాక్టర్లతో పోలీసుల వెనకాల ఎర్రకోట వైపు ర్యాలీ కొనసాగించారు. వందలాది మంది రైతులు, నిరసనకారులు ట్రాక్టర్లు, బైకులు, కార్లతో ఎర్రకోట ప్రాంగణాన్ని చేరుకొని.. ఎర్రకోటపై రైతు సంఘం జెండా ఎగురవేశారు.

ఉదయం నుంచే.. ట్రాక్టర్ తో విన్యాసాలు చేస్తూ… ర్యాలీని ఉత్సాహ పరిచిన ఓ రైతు.. మృతి చెందాడు. ట్రాక్టర్ పల్టీ కొట్టి చనిపోయాడని పోలీసులు చెప్తుండగా.. రైతులు మాత్రం.. పోలీసులే కాల్చి చంపారని ఆరోపించారు. రైతు మృతి పట్ల నిరసనలో ఉన్న రైతులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు నిరసనకారులు ఎగురవేసిన రైతు సంఘం జెండాను తొలగించేందుకు ప్రయత్నించారు. మధ్యాహ్నం రెండున్నర సమయంలో ఐటీవో కూడలి, ఎర్రకోట దగ్గర రైతులు, పోలీసులు పరస్ఫరం రాళ్లు రువ్వుకున్నారు. లాఠీఛార్జి చేస్తూ.. పోలీసులు ఎర్రకోట ప్రాంగణం నుంచి రైతులను తరిమివేశారు. సింఘు, టిక్రీ, గాజీపూర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్, రవాణా సేవలు నిలిపివేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం జరిపింది.

- Advertisement -

Latest news

Related news