ఒక్కరి కన్నీటి చుక్కలు వేల మంది రైతుల హృదయాల్ని కదిలించాయి. వేలాదిగా రైతులు కదం తొక్కేట్లు చేశాయి. ఉద్యమాన్ని అణిచివేస్తున్న బలగాలను వెనకడుగు వేసేట్లు చేశాయి. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాకేశ్ తికాయత్ కన్నీరు.. నీరుగారుతున్న రైతు ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది. అసలు నిన్న ఏం జరిగిందంటే..
రైతు ఉద్యమం రోజురోజుకీ ఓ కొత్త మలుపు తిరుగుతోంది. మొన్న రిపబ్లిక్ దినోత్సవ హింసాత్మక ఘటనల తర్వాత రైతులపై నింద వేసి ఎలాగైనా వారిని అక్కడినుంచి పంపేయాలని బలగాలు నిర్ణయించుకున్నాయి. వెళ్లాల్సిందే అని రైతులపై ఒత్తిడి పెంచాయి. అమాయకులైన కొందరు రైతులు ఇక ఖాళీ చేయడం తప్పదేమో అని ఒక్కొక్కరుగా కదిలారు.
అయితే ఇలా రైతులు మెల్లగా సిబిరాలను ఖాళీ చేస్తున్నారని తెలుసుకున్న జాట్ నేత రాకేశ్ తికాయత్.. కొందరు కిసాన్ మోర్చా నేతలతో ఘాజీపూర్‌కు చేరుకున్నారు. భద్రతా బలగాలు ఆయనను ముందుకు కదదలనివ్వలేదు. మీపై లుకవుట్ నోటీస్ ఉంది, మీరు లొంగిపోవాలి అని చెప్పారు. కానీ తికాయత్ వినలేదు. నోటీసుకు సమాధానం ఇవ్వడానికి మూడు రోజుల గడువు ఉంది. అప్పటిదాకా తనను నిర్బంధించలేరు అన్నారు. ఆ తరువాత ఆయన రైతులను ఒకచోట సమీకరించారు. ఈలోపు మళ్లీ భద్రతా బలగాలు ఆయన్ను తీసుకెళ్లడానికి ప్రయత్నించాయి. అయినా ఆయన లొంగలేదు. “బుల్లెట్లను నా శరీరంలో దించినా మీకు సరెండర్ కాను.. ఈ క్షణం నుంచే ఇక్కడే నిరాహార దీక్ష మొదలుపెడుతున్నా.. మా ఊరి మంచినీళ్లు తప్ప మరేమీ తాగను” అంటూ.. “నల్ల చట్టాలు తెచ్చి వేల మంది రైతులకు అన్యాయం చేస్తారా.. పాలకులే ఇలా చేస్తుంటే ఇక రైతులకు ఎవరు న్యాయం చేస్తారు” అని తికాయత్ కన్నీటి పర్యంతమయ్యారు. అంతే.. ఈ కన్నీళ్లు ఆందోళనను మరో మలుపు తిప్పాయి.
ఆయన కన్నీళ్లకు రైతులు ఎమోషనల్ అయ్యారు. తమ కోసం తికాయత్ కన్నీరు పెట్టడం యూపీ, హరియాణలోని రైతులను, జాట్ వర్గాన్ని తీవ్రంగా కలచివేసింది. ఆయన ఏడుస్తున్న వీడియో క్లిప్ కూడా వైరల్ అయింది. దాంతో మొత్తం యూపీ, హరియాణ, ఢిల్లీ అంతటా జాట్ రైతులు ఆగ్రహంతో బయలుదేరారు. పెద్ద ఎత్తున రైతులు ఘాజీపూర్ కు తండోపతండాలుగా చేరుకున్నారు. రాత్రికి రాత్రి ఘాజీపూర్ సరిహద్దుల్లో వందలాది శిబిరాలు వెలిశాయి. ఇప్పటి వరకూ దీన్ని సిక్కుల ఆందోళనగా చూశారు. కానీ ఇప్పుడు ఇది జాట్ రైతుల ఆందోళనగా మారింది. రైతుల ఉద్యమం కొత్త మలుపు తిరిగింది.
మొదట రాపిడ్ యాక్షన్ పోలీసుతో సహా 20 వేలమందికి పైగా పోలీసు బలగాలు రైతు శిబిరాలను ఎత్తివేసేందుకు ప్రయత్నించాయి. కానీ జాట్ రైతులు వస్తున్నారని తెలియడంతో రైతుల జోలికి పోవద్దని హోంశాఖ నుంచి వారికి ఆకస్మికంగా ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. జాట్ ల బలమైన ఓట్ బ్యాంకు దెబ్బతింటుందని భయపడడం వల్లే బలగాలు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు పంపించారని అక్కడి వారు చెప్తున్నారు.
ఇప్పటికీ ప్రతి పదినిమిషాలకూ రైతులు, మహిళలు, పిల్లలతో కూడిన వాహనాలు ఘాజీపూర్ చేరుకుంటూనే ఉన్నాయి. దీనితో వారం రోజుల క్రితం 2 వేల మంది కూడా రైతులు లేని ఘాజీపూర్ లో ఇపుడు 20వేల మంది దాకా పోగయ్యారు. ఈ ఉద్యమం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదైతే లేదని రైతులు అంటున్నారు.