జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత విద్యుత్ వాగ్ధానాన్ని నిలబెట్టుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. జనవరి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయనుంది. ఇప్పటికే డిస్కమ్‌లు క్షేత్రస్థాయి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెప్పించుకున్నాయి. త్వరలో సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించి.. ఆయన ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఇప్పటికే 20 వేల లీటర్ల దాకా తాగునీటిని ఉచితంగా సరఫరా చేయడానికి అవసరమైన కసరత్తును పూర్తి చేసింది. తాజాగా మరో కీలక ఎన్నికల హామీని తీర్చడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది.

ఉచిత జాబితాలోకి క్షురక, రజక వర్గాలు
ఇప్పటికే 24 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తుండగా… 101 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. తాజాగా క్షురకులు, రజకులు కూడా ఈ జాబితాలో చేరనున్నారు. అయితే కొత్త వర్గాలకు ఎన్ని యూనిట్ల దాకా ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారనేది సీఎం ఆమోదం మీదే ఆధారపడి ఉంది.