
అమరావతి దగ్గర రాయపాటి వెంకట్రావు అనే 50 ఎకరాల ఆసామి ఒకాయన ఉన్నడు. ఉన్న ఇద్దరు పిల్లలు మంచిగ సెటిలయిన్రు. మనోడిది టెన్షన్ లేని జిందగీ. కాని వెంకట్రావుకు పేకాట పిచ్చి. ఎంత అంటే కోట్లు విలువ చేసే భూమిని అడ్డికి పావుశేరు అమ్ముకునేంత పిచ్చి. పత్తాలాట కోసం 50 ఎకరాల భూమిని 50 లక్షల చొప్పున అప్పుడింత- అప్పుడింత అమ్మేసిండు. ఆంధ్రలో అయితే చెయ్యి తిరుగుతలేదని బెంగళూరుకు పోయి పత్తాలాడిండు. ప్లేస్ మారింది కాని వెంకట్రావు ఫేట్ మారలేదు. పేకాటలో సాంతం పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిండు. చేతిలో చిల్లీగవ్వ లేకపోయేసరికి ఏం చేయాల్నో సమజ్ కాలేదు.
కట్ చేస్తే, హైదరాబాద్ సనత్ నగర్ ఏరియాలోని జెక్ కాలనీలో క్లాసిక్ ఆర్కేడ్ అపార్టుమెంటు, ఫ్లాట్ నెంబర్ 501లో మొన్నో దొంగతనం జరిగింది. ఆ ఇల్లు ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగిది. 35 తులాల బంగారం, రెండు కేజీల వెండి పోయిందని పోలీసులకు కంప్లయింట్ అందింది. సీసీ ఫుటేజీలో పోలీసులకు దొంగ ఆనవాళ్లు దొరికినయి. గుంటూరు పోయి దొంగను అదుపులోకి తీసుకున్నరు. సుమారు 10లక్షల విలువ చేసే చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నరు. పేకాట పిచ్చితో సర్వం పోగొట్టుకున్న రాయపాటి వెంకట్రావే ఆ దొంగతనం చేసిందని పోలీసులకు తెలిసింది. 50 ఎకరాలను రూ.50 లక్షల చొప్పున అమ్మి, ఆ సొమ్మునంతా పేకాటలో పోగొట్టుకున్నాడని తెలిసి హైదరాబాద్ పోలీసులు షాకియిన్రు. చెడు వ్యసనాలు మనిషిని ఎంతకైనా దిగజార్చుతాయనడానికి రాయపాటి వెంకట్రావే నిదర్శనం.