బరువు తగ్గాలంటే ఒంట్లో ఫ్యాట్ తగ్గించాలి అంటారు. మరి ఫ్యాట్ తగ్గించాలంటే వంటల్లో నూనె తగ్గించాలి. కానీ అసలు నూనె లేకుండా వంటలు ఊహించగలమా.. నూనె లేకుండా వంట చేయడమనేది అస్సలు కుదిరే పనే కాదు. మరి ఈ సమస్యకు సొల్యూషన్ ఎది? అందుకే కనీసం ఎంచుకునే నూనె అయినా సరిగ్గా ఉంటే కొంతవరకూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చంటున్నారు డైట్ ఎక్స్పర్ట్స్
మనం వాడే నూనెల్లో బోలెడు రకాలున్నాయి. అయితే అందరూ కామన్‌గా వేరుశెనగ లేదా సన్‌ఫ్లవర్ నూనెలను వాడుతుంటారు. కానీ టీవీల్లో మాత్రం ఆలివ్ ఆయిల్ బరువు తగ్గడానికి మంచిదని చెప్తారు. పోనీ అదే వాడదాం అంటే.. అదేమో కాస్ట్లీ. అసలీ నూనెలను ఏం చూసి కొనాలి? మంచి నూనెను ఎలా ఎంచుకోవాలి?

ఇవి చెక్ చేయాలి
డైటీషియన్స్ ప్రకారం నూనెల్లో ముఖ్యంగా చూడాల్సినవి రెండు. ఒకటి వాటిలోని పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ (PUFA), మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ (MUFA). వీటితో పాటు ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఏయే పరిమాణాల్లో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. నూనెల్లో ఉండే మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్..రక్తంలోని ప్లేట్లెట్స్ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డయాబెటిస్, గుండె సమస్యల నుంచి కాపాడతాయి. అందుకే నూనెల్లో మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే నూనెల్ని ఎంచుకోవాలి. అయితే.. అన్ని నూనెల్లో అన్ని రకాల న్యూట్రియెంట్స్ ఉండవు. ఒక్కో నూనెలో ఒక్కో విటమిన్ లేదా ఒక్కోరకమైన మంచి ఫ్యాట్స్ ఉంటాయి.
కలిపితే బెస్ట్
ఒకరకంగా చూస్తే.. అన్ని నూనెల కంటే ఆలివ్ ఆయిల్లు ఉన్నంతలో బెస్ట్. అయితే దీనిని మన వంటల్లో అంతగా ఇష్టపడరు. పైగా ఆలివ్ ఆయిల్ ఖరీదెక్కువ. అందుకే నూనెల నుంచి మంచి పోషకాలందాలంటే.. ఒక్క నూనెకు ఫిక్స్ అవ్వకుండా నూనెలు మారుస్తూ ఉండడం మేలు. ఒకటే నూనె వాడేబదులు రెండు నూనెలు కలిపి వాడడం మంచిదంటున్నారు డైటీషియన్స్. సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ అయిల్ లేదా కొబ్బరి నూనె ఇలా కాంబినేషన్లో వాడితే మంచి ఫలితం ఉంటుందంటున్నారు. దీంతోపాటు నూనెల విషయంలో గుర్తుంచుకోవాల్సిన ఇంకొన్ని టిప్స్ ఏంటంటే..

ఏ నూనె వాడుతున్నాం అనేదాని కంటే ఎంత నూనె వాడుతున్నాం అనేది ముఖ్యం. పరిమితంగా వాడినంత కాలం ఏ నూనె అయినా ఆరోగ్యకరంగానే పని చేస్తుంది. రోజుకు 20 నుంచి 30 గ్రాముల నూనె తీసుకోవాలి. అంటే వంటల్లో చాలా తక్కువగా నూనె వాడాలి.
వేర్వేరు నూనెల్లో వేర్వేరు పోషకాలు ఉంటాయి కాబట్టి అన్నిటినీ పొందాలంటే నూనెలను తరచుగా మారుస్తూ ఉండాలి. లేదా కాంబినేషన్స్‌లో వాడాలి.
నూనెను వేడి చేసినప్పుడు వాటి టెంపరేచర్ మారి ఒక పాయింట్ దగ్గర లైట్‌గా పొగ వస్తుంది. దీనిని స్మోకింగ్ పాయింట్ అంటారు. ఆ పాయింట్‌కు మించి ఆయిల్స్‌ను వేడిచేయకూడదు. అలా చేస్తే అందులో ఉండే విటమిన్ E ఆవిరైపోతుంది. అయితే కొన్ని రిఫైన్డ్ ఆయిల్స్‌ను ఎంత వేడి చేసినా వాటి నుంచి స్మోక్ రాదు.

ఏ నూనెనైనా నాలుగుసార్ల కంటే ఎక్కువ వేడి చేసి వాడకూడదు. అలాగే వంటనూనెపై ఎండ పడకుండా చూడాలి. నూనెపై నేరుగా ఎండ పడితే అందులో కొన్ని రసాయనిక మార్పులు జరుగుతాయి.
వంటనూనె కొనేముందు అందులో ఉన్న కొవ్వు శాతం చూసి కొనాలి. ఎనిమిది నుంచి పది శాతం శాచ్యురేటెడ్ కొవ్వు ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ప్రమాదకరం. అలాగే నూనెలో ముంచి తయారుచేసిన వేపుళ్లకు బదులు తక్కువ నూనెతో వండిన వంటకాలు ఆరోగ్యకరం.