అరుణాచల్ ప్రదేశ్ సుబాన్సిరి జిల్లాలో తారిచు నది సమీపంలోకి చైనా చొరబాటుకు పాల్పడింది. అంతర్జాతీయ బార్డర్ దాటి 4.5 కిలోమీటర్ల మేర లోపలికి వచ్చి ఏకంగా ఓ ఊరినే నిర్మించింది. చైనా అక్రమంగా నిర్మించిన ఆ ఊర్లో 101 ఇండ్లు ఉండటం విశేషం. గతేడాది నవంబర్ 1న శాటిలైట్ ఈ ఫొటోలను తీసింది. ఇదే ప్రాంతంలో 2019, ఆగస్ట్ 26న తీసిన మరో ఫొటోలో ఎలాంటి నిర్మాణాలు కన్పించకపోవడం గమనార్హం. ప్రముఖ చానెల్ ఎన్డీటీవీ బయటపెట్టిన దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ప్రాంతంపై చాలా కాలంగా రెండు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. ‘చైనా సరిహద్దు ప్రాంతంలో చైనా అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి వచ్చిందని’ భారత విదేశాంగ శాఖ స్పందించింది.

చైనా చొరబాట్ల గురించి గతంలోనే అరుణాచల్ బీజేపీ ఎంపీ తపిర్ గావో లోక్‌సభలో ప్రస్తావించారు. సుభాన్‌సిరి జిల్లాలోనే చైనా చొరబాట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. 60-70 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందని ఆయన పార్లమెంట్ లో వెల్లడించారు. సర్వే ఆఫ్ ఇండియా అధికారిక ఆన్లైన్ మ్యాప్‌లోనూ భారత భూభాగంలోనే చైనా గ్రామం నిర్మించినట్లుగా స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం.