అందేంది.. ఎవరైనా బిడ్డ పెండ్లికి రావొద్దని చెప్తరా? పదిమంది వచ్చి దీవిస్తే.. బిడ్డ, అల్లుడు సల్లగ పదికాలాల పాటు పచ్చగ ఉంటరని ఆశ పడుతరు కదా అని ఆలోచిస్తున్నరా? ఆగుర్రాగుర్రి మీ దమాక్ కు జెరసేపు రెస్ట్ ఇయ్యిర్రి. ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు.. మా బిడ్డ పెండ్లికి రాకపోతేనే మీకు మంచిది.. మాకు మంచిది అని ప్రకటించిండు ఓ మాజీ ఎమ్మెల్యే.
మాజీ ఎమ్మెల్యే బిడ్డ పెండ్లంటే ఎట్లుండాలె.. తెల్ల తెల్ల బట్టలేసుకొని పెద్ద మనుషులు ముంగట కూసుంటే.. భారీ పట్టు చీరలు కట్టుకొని అమ్మలక్కలు సందడి చేస్కుంట పందిట్ల తిరగాలె. బ్యాండు, డీజే, పటాకులు, డెకరేషన్లు, భోజనాలు నియోజకవర్గం ప్రజలు కనీసం నాలుగైదు రోజులన్న మాట్లాడుకోవాలె. కానీ.. ఏపీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఏం చేశిండో తెల్సా? తన బిడ్డ పెండ్లికి ఎవ్వలు రావొద్దని కరపత్రాలు పంచిండు. వాల్ పోస్టర్లు కొట్టిచ్చి గోడలకు అంటవెట్టిచ్చిండు.

అదేంది.. బిడ్డ పెండ్లికి రాకుర్రి అని చెప్తరా ఎవరన్న అని ఆ మాజీ ఎమ్మెల్యేను బదునాం జెయ్యకుర్రి. ఆయన ఎందుకు రావొద్దన్నడో తెలిస్తే.. మీరే సప్పట్లు కొడుతరు. ఎంత పేదోడు పిలిశినా.. సరే. చిన్న శుభకార్యమైనా సరే.. పిల్వంగనె పోయే నాయకుడు ఎపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అసొంటిది జనవరి 3న జరిగే ఆయన బిడ్డ పెండ్లికి మాత్రం ఎవ్వరినీ రావొద్దని కోరుకుంటున్నడు.
కరోనా మళ్లీ విస్తరించుడు.. దీనికి తోడు బ్రిటన్ కెళ్లి కొత్త వైరస్ బైటపడుడు వంటి పరిస్థితులను గమనించి చింతమనేని ఈ నిర్ణయం తీసుకుండట. అయితే.. పెండ్లి సూడాలంటే ఎట్ల అని డౌటొచ్చిందా? తన అభిమానులు, కార్యకర్తల కోసం చింతమనేని ఓ ఆలోచన చేశిండు. కరోనా నిబంధనల కారణంగా నా బిడ్డ పెండ్లికి మీరు రావొద్దు. లగ్గం సూడాలంటే ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లల్ల లైవ్ సూడుర్రి. పిల్ల పిలగాన్ని, మమ్మల్ని దీవించుండ్రి అని పత్రికలు కొట్టించి పంచి పెట్టిండు. పత్రికతో పాటే.. ఓ స్వీట్ డబ్బ కూడా పంపిండు. చింతమనేని ఆలోచనకు అటు నాయకులు, ఇటు సుట్టాలు, కార్యకర్తలు మెచ్చుకుంటున్నరు.