ఆందోళనలు వీడి వెంటనే ప్రభుత్వంతో చర్చలకు రావాలని ప్రధాని మోదీ రైతులకు పిలుపునిచ్చారు. “ఆందోళన చేసే హక్కు మీకుంది. కాదనను. కానీ ఆందోళనలో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉండడం సరికాదు. రండి… కూర్చుని మాట్లాడదాం. చర్చలకు రండి” అని అన్నారు.
కనీస మద్దతు ధర(ఎమ్ఎస్పీ) ఎప్పటిలాగానే ఇప్పుడూ ఉందనీ, ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. “సంస్కరణలకు ఓ అవకాశం ఇవ్వండి. ఇది మీకు ఎంతో మేలు చేస్తుంది. మార్పు నిరంతర ప్రక్రియ. ఏ చట్టమూ నిశ్చలంగా ఉండిపోదు. గతిశీలంగా ఉంటుంది.. కాలం ఎవరికోసమూ ఆగదు. ముందుచూపుతో ముందడుగు వేద్దాం. ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకుందాం” అని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “దేశానికి సిక్కులు చేసిన సేవ వెలకట్టలేనిది. దేశ విభజన సమయంలో, కశ్మీర్ లో , ఈశాన్యంలో.. ఇలా ప్రతీచోటా సిక్కులు బలయ్యారు.. సిక్కు గురువుల ప్రబోధాలు ఎన్నటికీ మరువలేం. అలాంటి సిక్కుల గురించి చెడుగా మాట్లాడడం మంచిది కాదు” అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
చర్చలకు రెడీ.. డేట్ ఫిక్స్ చేయండి
మరో పక్క చర్చలకు రావాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును రైతు సంఘాలు స్వాగతించాయి. చర్చల తేదీని ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వంతో చర్చలను తాము ఎన్నడూ వ్యతిరేకించలేదని అన్నాయి.
