రైతుల ఆందోళన మొదలైన తర్వాత, మరీ ముఖ్యంగా రిపబ్లిక్ డే హింసాత్మక ఘటనల తరువాత మొదటిసారిగా చర్చలకు సిద్ధమని ప్రధాని స్వయంగా ప్రకటించారు.
” రైతులకు ఒక్క ఫోన్‌కాల్ దూరంలోనే ఉన్నాం. ఏడాదిన్నర పాటు సాగు చట్టాల సస్పెండ్ అనే ప్రతిపాదన ఇప్పటికీ సజీవంగానే ఉంది. పోయిన సారి చర్చలు జరిగినపుడు ఏ వైఖరితో ఉన్నామో ఇపుడూ అదే విధంగా ప్రభుత్వం ఉంది” అని ప్రధాని మోదీ శనివారం అఖిలపక్ష నేతలకు చెప్పారు.
చట్టాల్లోని మంచిచెడ్డల్ని సంయుక్త కమిటీ ద్వారా విచారించేందుకు కేంద్రం సిద్దమేనని వ్యవసాయమంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితులు తొలగిపోయేందుకు పార్లమెంట్లో చర్చలు ఒక మార్గమని ప్రధాని అన్నారు. వివిధ పార్టీల నేతలు లేవనెత్తిన అంశాలపై పార్లమెంట్లో చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని, సభలో సమగ్రం గా చర్చలు జరగడం అత్యంత అవసరమని మోదీ అన్నారు.