29.3 C
Hyderabad
Monday, March 1, 2021

16 ఏండ్లుగా సెలవు పెట్టలేదు.. ఈమె సేవకు సలాం!

సూర్యాపేట వీధులకు ఆమె సుపరిచితం. కాలువల్లో పారే మురుగుకు ఆమె బద్ధ శత్రువు. ఎక్కడ చెత్త కనిపించినా.. దాన్ని క్షణాల్లో తీసేసి ఆ ప్రదేశాన్ని అద్దంలా మెరిసేలా చేస్తుందామె. ప్రతిరోజూ ఉదయం జాగింగ్ చేసేవారికి ఆమె కనిపించని రోజే ఉండదు. గత పదహారేళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసిందామె. కరోనా కోరలు చాచిన రోజుల్లో కూడా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా.. అలసిపోకుండా సేవలందించిందామె. ఆమె పేరే.. మారుతమ్మ. సూర్యాపేట డివిజన్ లో సేవలందించే పారిశుద్ధ్య కార్మికురాలు. ఆమె సేవలను గుర్తించిన నేషనల్ వుమెన్ కమిషన్ ఆమెకు నేషనల్ కొవిడ్ వారియర్ అవార్డు ప్రకటించింది.
సూర్యాపేటలో ఒక్కరోజులోనే పది, ఇరవై, ముప్పై ఇలా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నా.. ఆమె మాత్రం వీధులు శుభ్రం చేస్తూ తిరుగుతూనే ఉంది. ఎవరింట్లో వారు భయంభయంగా తలుపులు వేసుకొని ఇంటికే పరిమితమైపోయారు. పట్టపగలు కూడా అంతా నిర్మానుష్యం. ఆ పరిస్థితుల్లో కూడా మారుతమ్మ వీధులన్నీ ఊడ్చి.. పరిశుభ్రంగా ఉంచింది. సమాజాన్ని కాపాడటంలో తనవంతు బాధ్యత నెరవేర్చింది.
మారుతమ్మతా సూర్యాపేట. భర్త సుతారి పనిచేసేవాడు. ఇద్దరు కొడుకులు. 2012లో భర్త అనారోగ్యంతో తనువు చాలించాడు. పిల్లలు చిన్నోళ్లు. కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకొని పారిశుద్ధ్య కార్మికురాలిగా సేవలందిస్తూ వచ్చింది. శుభకార్యాలు, దావత్ లు, పండుగలు, పబ్బాలు ఏవీ ఉండవు ఆమెకు. పనే దైవం.. పనే పండుగ. పిల్లలను చదివిస్తూ.. తండ్రి లేని లోటు తెలియకుండా సాకుతున్నది. జీతాలు పెంచి.. మాలాంటోళ్ల బాధను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ సార్ కు దండాలు అంటున్నది మారుతమ్మ.
కరోనా సమయంలో సేవలందించిన మారుతమ్మకు జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కొవిడ్ వారియర్ అవార్డు ప్రకటించింది. తనకు అవార్డు రావడం పట్ల స్పందించిన మారుతమ్మ.. ‘జీతం తీసుకుంటున్నప్పుడు పని చెయ్యాలె కదా. చెత్త ఊడ్వడం.. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం నా పని. జనాలకు రోగాలు రాకుండా.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం నా పని. అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తూ కరోనా సమయంలో పని చేశినం. అందుకు ఇప్పుడు ఏదో అవార్డు వచ్చిందని పెద్ద సారు చెప్పిండు. చాలా సంతోషంగ ఉంది’ అంటోంది మారుతమ్మ.

- Advertisement -

Latest news

Related news