నేతాజీ సుభాశ్ చంద్రబోస్ స్ఫూర్తితోనే ఈ రోజు భారత్ ముందుకు వెళుతోందని, ఆయన చేసిన కృషి తరతరాల వారూ గుర్తుంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేతాజీ 125 వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని కోల్కతా మెమోరియల్ హాల్లో జరిగిన సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతాజీ దేశం కోసం చేసిన సేవ, త్యాగాన్ని గుర్తుంచుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమన్నారు. ఏటా జనవరి 23 వ తేదీని ‘పరాక్రమ్ దివస్’ గా జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. కులం, మతం, ప్రాంతం… ఇలా ఏదీ చూడకుండా ప్రతి వ్యక్తిని నేతాజీ సైనికుడిగా తయారు చేశారని, భారత్ దాస్య శృంఖలాలను తెంచాలన్న ఒకే ఒక సంకల్పంతో నేతాజీ ముందడుగు వేశారని కొనియాడారు. 2018లో అండమాన్ ద్వీపానికి ”నేతాజీ సుభాశ్ చంద్రబోస్ ద్వీపం” అని పేరు పెట్టామని ఆయన గుర్తు చేశారు.
దీదీ ఆగ్రహం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జికి మాట్లాడేందుకు ఆహ్వానించగానే కొందరు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలతో అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహానికి లోనైన మమతాబెనర్జి ‘ఆహ్వానించి అవమనిస్తారా..?’ అని మండిపడ్డారు. ‘ఇదేమీ పార్టీ కార్యక్రమం కాదు. ఒక వ్యక్తిని మాట్లాడమని ఆహ్వానించి.. గోళ చేయడం మంచి పద్ధతి కాదు. నాకు జరిగిన అవమానానికి నిరసనగా..ఏమీ మాట్లాడబోను’ అని చెప్పి మమతాబెనర్జి తన స్థానానికి వెళ్లి కూర్చుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలోనే ఇదంతా జరగడం గమనార్హం.