29.3 C
Hyderabad
Monday, March 1, 2021

కొత్త పార్లమెంట్ డిజైన్స్ చూశారా?

మన పార్లమెంట్ భవనం అప్‌డేట్ అవ్వబోతోంది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు ఇవాళ్టి నుంచే మొదలవుతున్నాయి. ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి ప్రధాని మోదీ డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
సెంట్రల్‌ విస్టా పునరాభివృద్ధిలో భాగంగా 14 మంది సభ్యుల వారసత్వ కట్టడాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కొత్త భవన నిర్మాణం కొనసాగనుంది. కొత్త భవనాన్ని గుజరాత్‌కు చెందిన హెచ్‌సీపీ సంస్థ డిజైన్‌ చేయగా, నిర్మాణ పనులకు టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్‌ కాంట్రాక్ట్ తీసుకుంది.

హైలెట్స్ ఇవే..
ఈ భవన నిర్మాణం కోసం 2 వేల మంది ప్రత్యక్షంగా, 9 వేల మంది పరోక్షంగా పనిచేస్తారు. అలాగే 200 మందికి పైగా దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులు కూడా ఇందులో పాల్గొంటారు.


రూ. 971 కోట్ల బడ్జెట్‌తో ఈ కొత్త భవనం కట్టనున్నారు. భూకంపాలకు, ఇతర ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకునేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.


ఇప్పుడు కట్టబోయే భవనం 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఉంటుంది. ఇది ప్రస్తుత భవనం కంటే ఇది 17 వేల చదరపు మీటర్లు పెద్దది.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రటేరియట్ భవనం నిర్మిస్తారు. అలాగే రాజ్‌పథ్ రోడ్‌ను మరింత డెవలప్ చేస్తారు.


కొత్త భవనం చూడ్డానికి ప్రస్తుత భవనం లాగానే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఎత్తులోనే ఉంటూ మూడు అంతస్తులను కలిగి ఉంటుంది.
2022 ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పార్లమెంట్ కొత్త భవనాన్ని తీర్చిదిద్దాలని, ఆ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.

ఈ కొత్త భవనంలో ఒకేసారి 1,224 మంది ఎంపీలు కలిసి కూర్చునే వీలుంది. ఇందులో మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు, పార్లమెంటు సభ్యుల కోసం విశాలమైన లాంజ్‌, గ్రంథాలయం, బహుళ కమిటీల గదులు, భోజనశాలలు వంటివి కూడా ఉంటాయి. పార్లమెంటు, ఎంపీల ఆఫీస్ కి మధ్య సబ్ వే ఏర్పాటు చేస్తారు.


ఇప్పుడున్న పార్లమెంట్ భవన నిర్మాణానికి 83 లక్షలు ఖర్చయింది. 1921 ఫిబ్రవరి 12న భవన శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తి అవ్వడానికి ఆరేళ్లు పట్టింది. 1927 జనవరి 17న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ భవనం నిర్మించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ఇప్పుడు కొత్తగా అప్ డేట్ చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ బిల్డింగ్ నిర్మించి వందేళ్లు అయినా భవనం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది.

- Advertisement -

Latest news

Related news