నిన్న అనౌన్స్ చేసిన పద్మ అవార్డుల్లో.. తెలంగాణ ఆదివాసీకి అరుదైన గౌరవం దక్కింది. కొమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన ఆదివాసీ కళాకారుడు కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం వరించింది.
ఆదివాసీల అరుదైన కళ అయిన గుస్సాడీకి దశాబ్దాలుగా ప్రాణం పోస్తున్న కనకరాజుకు ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. తెలంగాణలోని గిరిజనుల సంస్కృతులు ప్రతిబింబించేలా కనకరాజు గుస్సాడీ కళను ప్రచారం చేశారు. అంతరిస్తున్న గుస్సాడీ కళను కాపాడుకుంటూ వచ్చారు. కనకరాజుకు పద్మశ్రీ ప్రకటించడంతో ఆదివాసీలు ఆనందించారు.
80 ఏళ్ల కనకరాజుకు సన్మానం చేశారు. ఇందిరాగాందీ హయాంలో ఢిల్లీలోని ఎర్రకోటలో ఇదే రిపబ్లిక్ డే వేడుకల్లో గుస్సాడీ కళను ప్రదర్శించి ఆకట్టుకున్న కనకరాజు.. మహామహా నేతల సమక్షంలో తమ కళను ఆవిష్కరించారు. ఎన్నో అవార్డులు అందుకున్నాన్నారు. గుస్సాడీ కళను తర్వాతి తరం వాళ్లకు కూడా నేర్పిస్తున్నానని, ప్రస్తుతం పుట్టిన ఊరు మర్లవాయిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నానని, ఉన్న ఊర్లోనే కాస్త తిండి దొరికేట్టు చూస్తే చాలని ప్రభుత్వాన్ని కోరారు.