పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపత్రి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. సమస్యలను, సవాళ్లను అధిగమించి భారత్ ముందుకెళ్తుందని ఆయన అన్నారు. కరోనా, బర్డ్‌ఫ్లూ లాంటి వ్యాధులను దేశం సమర్ధంగా ఎదుర్కొందని చెప్పారు. పేదల కోసం వన్ నేషన్-వన్ రేషన్ తీసుకొచ్చిందని, జన్‌ధన్ యోజన ద్వారా నేరుగా అకౌంట్లలోకి డబ్బు చేరిందని, ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ క్లిష్ట పరిస్థితుల్లో ఒక వరంగా మారిందని ఆయన అన్నారు.
దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతుల కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చామని, అవి సాగులో కొత్తదనాన్ని తీసుకొస్తున్నాయని అయన అన్నారు. కొత్త విధానాలతో రికార్డు స్థాయిలో ఉత్పత్తి ఉంటుందని తెలిపారు. గరీబ్ కల్యాణ యోజన కింద మహిళలకు 1,500 రూపాయలు, మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా ప్రధానమంత్రి జన ఔషధి యోజనతో తక్కువ ఖర్చుతో మందులు అందుతున్నాయని, గత ఆరేళ్లలో ప్రభుత్వ వైద్య కాలేజీలు పెంచామని.. 26 ఎయిమ్స్‌ను కొత్తగా ఏర్పాటు చేశామని ఆయన స్పీచ్ లో తెలిపారు.
దేశంలో వ్యవసాయ రంగం మరింత వృద్ధి సాధించాలని రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు. స్వామినాధన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు మద్ధతు ధరలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. వ్యవసాయంలో అధునిక పద్ధుతుల్ని రైతులకు వద్దకు తీసుకెళ్తున్నామని తెలిపారు.