కిసాన్ ట్రాక్టర్ ర్యాలీలో అల్లర్లకు కారణమైన పంజాబీ నటుడు దీప్ సింగ్ సిద్ధూను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దీప్ సిద్ధూను అదుపులోకి తీసుకుని.. అందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. రైతుల ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడానికి ప్రధాన కారణం దీప్ సింగ్ సిద్ధూ అని.. పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు. కాగా.. ఆరోజు నుంచి కనిపించకుండా పోయిన సిద్ధూను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీప్ సిద్దూ తరుచూ ఓ మహిళా స్నేహితురాలితో టచ్లో ఉండేవారు. కాలిఫోర్నియాలో ఉంటున్న ఆమెకు అతను పలు వీడియోలు పంపేవాడని పోలీసులు విచారణలో తేల్చారు. అయితే దీప్ పంపిన ఫోటోలు, వీడియోలను.. ఫేస్బుక్ అకౌంట్లో ఆ మహిళ అప్లోడ్ చేసేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. చండీఘడ్ – అంబాల మధ్య గల జిరాక్పూర్ ప్రాంతంలో దీప్ సిద్దూను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కిసాన్ ట్రాక్టర్ ర్యాలీలో అల్లర్లకు కారణమైన 12 మంది ముఖచిత్రాలను ఢిల్లీ పోలీసులు ఈ మధ్యే రిలీజ్ చేశారు. కర్రలతో ఈ 12మంది పోలీసుల మీద దాడులు చేసినట్టు వీడియోలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీ అల్లర్లకు సంబంధించి మొత్తం 44 కేసులు నమోదు కాగా, 122 మందిని అరెస్టు చేశారు.
రైతు ర్యాలీలో అల్లర్లకు కారణమైన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ అరెస్ట్
