జేఈఈ, నీట్ లతోపాటు ఇతర పరీక్షలకు సిద్ధమయ్యే స్టూడెంట్స్ ఆందోళన పడొద్దని, తగ్గించిన సిలబస్ నుంచే ప్రశ్నలు అడుగుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మరోసారి స్పష్టం చేశారు. సోమవారం లైవ్ వెబ్నార్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల స్టూడెంట్స్ తో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అడిగిన పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. 30 శాతం సిలబస్ ని సీబీఎస్ఈ తగ్గించినట్లు గుర్తుచేశారు.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు, జేఈఈ- మెయిన్ 2021, నీట్ 2021 పరీక్షలకు తగ్గించిన సిలబస్ నుంచే ప్రశ్నలు ఉంటాయని స్పష్టం చేశారు. సిలబస్ ఆధారంగానే విద్యార్థులు చదవాలని సూచించారు. కేంద్రీయ విద్యాలయాల్లో క్లాసులను దశలవారీగా పునఃప్రారంభిస్తామని, సగం మంది స్టూడెంట్స్ క్లాసులకు హాజరైతే.. మిగతా సగం మందికి ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తామన్నారు. కరోనా సమయంలో విద్యార్థుల అనుభవాలను రాయమని స్టూడెంట్స్ కి రమేష్ సూచించారు. బెస్ట్ అనుభవాన్ని పంచుకున్న స్టూడెంట్ ని సన్మానిస్తామన్నారు.