తమిళనాడులో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడులో ఫేమస్ అయిన ‘విలేజ్ కుకింగ్ ఛానెల్’ నిర్వహించే పెరియతంబీ బృందాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన విజిట్ తో ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో వారు వండుతున్న మష్రూమ్ బిర్యానీ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
బిర్యానీలో వాడే పదార్థాల పేర్లను అడిగి తమిళంలో పలికేందుకు రాహుల్ ట్రై చేయడం.. బాగా కుదిరింది అంటూ కామెంట్ చేస్తూ.. ఉత్సాహంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. కుకింగ్ ఛానెల్లో కనిపించడమే కాక స్వయంగా గరిటె తిప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. స్వయంగా రైతాను తయారు చేయడంతోపాటు కుకింగ్ టీంతో కలిసి వారు వండిన మష్రూమ్ బిర్యానీని రుచి చూశాడు. అనంతరం బిర్యానీ సూపర్ అంటూ వారిని తమిళంలో ప్రశంసించారు.
‘తమ వంటలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని.. దేశంలోని పలు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా వెళ్లి వంటలు చేయాలనేది తమ కోరిక అని’ కుకింగ్ బృందం రాహుల్ గాంధీకి వివరించారు. అది విన్న రాహుల్.. అమెరికాలో తనకొక ఫ్రెండ్ ఉన్నాడని, ఆయనకు చెప్పి షికాగోలో వంట ప్రోగ్రామ్ పెట్టిస్తానని హామీ ఇవ్వడంతో వీడియో ముగుస్తుంది. 14 నిమిషాల నిడివి గల ఈ వీడియో చివరివరకు ఆసక్తికరంగా సాగింది.