29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

తడోబా నేషనల్ పార్కులో అరుదైన నల్లచిరుత

ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చాలాప్రాంతాల్లో చిరుతపులుల సంచారం ఎక్కువైపోయింది. చిరుత అనే పేరు వినపడితేనే జనాలు భయపడిపోతున్నారు. అలాంటిది కండలు తిరిగిన నల్లచిరుత చింతనిప్పుల్లాంటి కళ్లతో రోడ్డుకు అడ్డుగా నిలబడితే ఎలా ఉంటదో ఓసారి ఊహించుకోండి. 30 అడుగుల దూరంలో నల్లచిరుత నిలబడి కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ ఫీలింగ్ ను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అనురాగ్ గవాండేకు ఎదురైంది.
మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లోని పులులను ఫొటోలు తీయడానికి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అనురాగ్ గవాండే తన టీమ్ తో కలిసి జీప్ లో తడోబా పార్క్ కి వెళ్లాడు.

పులి ఫొటోల కోసం వెతుకుతున్న అనురాగ్ కు కొద్దిదూరంలో జింక అరుస్తున్న శబ్దం వినిపించింది. ఆ వైపు కచ్చితంగా పులి ఉంటుందని అటుగా వెళ్తున్న అనురాగ్ కు అరుదైన అనుభవం ఎదురైంది. 30 అడుగుల దూరంలో కండలు తిరిగిన నల్ల చిరుత రోడ్డుకు అడ్డుగా నిలబడి ఉంది. పులి కనిపిస్తుందేమోనని వెళ్లిన అనురాగ్ కు అరుదైన నల్ల చిరుత జింకను వేటాడేందుకు ప్రయత్నిస్తూ కనిపించింది. జింకను వేటాడుతూ.. అనురాగ్ అండ్ టీమ్ ప్రయాణిస్తున్న వాహనానికి ఎదురుగా వచ్చి ఆగింది. వెంటనే అనురాగ్ అరుదైన నల్లచిరుతను తన కెమెరాలో బంధించాడు. ఆ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. తడోబా నేషనల్ పార్క్ లో ఒకేఒక నల్లచిరుత ఉంది. అదే నల్ల చిరుత తనకు కనిపించడంతో అనురాగ్ ఆనందంతో ఉబ్బితబ్బైపోతున్నాడు. 25 ఏళ్ల ఈ యువ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ సరిగ్గా సంవత్సరం క్రితం అదే నల్ల చిరుతను తడోబా పార్క్‌లో చూశాడట. మళ్లీ ఇన్నాళ్లకు కనిపించిందట. ఫస్ట్ టైమ్ నల్లచిరుతను చూసినప్పుడు ఎంత థ్రిల్ ఫీలయ్యానో, అదే థ్రిల్ ఇప్పుడూ కలిగిందంటున్నాడు అనురాగ్.

- Advertisement -

Latest news

Related news