ఉత్తరాఖండ్ లో నిన్న జరిగిన ప్రమాదాన్ని ఎవరూ ముందుగా ఊహించలేకపోయారు. ఉన్నట్టుండి మంచు చరియలు విరిగి పడడంతో నీరు ఉదృతంగా పారింది. దాంతో ధౌలిగంగా నది వరదలా మారి దిగువన ఉన్న ప్రాంతాలను ముంచేసింది. నిన్నజరిగిన ప్రమాదంలో దాదాపు 150 మంది చనిపోయారు. ఉన్నట్టుండి సడెన్ గా ఇలాంటి విపత్తులు రావడానికి కారణాలేంటి?
కారణమిదే..
హిమాలయాల్లో భారీగా నీటి నిల్వలు మంచు రూపంలో ఉంటాయి. ముఖ్యంగా నిన్న ప్రమాదం జరిగిన హిమాలయ ప్రాంతం హిందుఖుష్ పర్వత శ్రేణి కిందకు వస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మంచు పర్వతాలు ఉన్న ప్రాంతం. చల్లగా ఉన్నంత వరకూ ఇక్కడి మంచుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే భూమిపై వేడి పెరుగుతుందో.. క్రమంగా మంచు కరగడం మొదలవుతుంది. గత కొంత కాలంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు.
ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం వల్ల భూమిపై ఉన్న మంచు కరుగుతుంది. అలా కరిగినప్పుడు మంచు రూపంలో కొండల్లా పేరుకుని ఉన్న కొండలు ఏదో ఒక టైంలో విరిగి పడిపోతాయి. ఇలా జరిగినప్పుడు దిగువన ఉన్న నదుల్లో ఒక్కసారిగా అలజడి పెరిగి వరదలా కిందికి దూసుకుపోతాయి. నది నీటితో పాటు విరిగిపడిన మంచు చరియల్లోని నీరుకూడా చేరి నీటి ఉదృతం మరింత ఎక్కువవుతుంది. నిన్న జరిగింది కూడా అదే.

మనమేం చేయాలి?
వాతావరణంలో వేడిని తగ్గించాలంటే గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించాలి. పొల్యూషన్ తగ్గించాలి. సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు లాంటి వాటిని వాడాలి. చెట్లను నరికివేయకుండా మరిన్ని కొత్త చెట్లు నాటాలి. అడవుల నరికివేతను ఆపాలి. హిమనీ నదాలు కరిగిపోవడం ప్రతీ ఏటా ఎక్కువవుతుందని సర్వేలు చెప్తున్నాయి. ప్రతి పదేళ్లకు ఉష్ణోగ్రతల్లో వేగవంతమైన మార్పులొస్తున్నాయని, భూమిపై వేడి క్రమంగా పెరుగుతుందని.. ఇది మానవాళికే ఎంతో ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోగలిగినప్పుడే ఈ భూమి మీద నివసించడం సాధ్యమవుతుంది. లేదంటే పకృతి ఇలానే విజృంభించి తనకు జరిగిన నష్టాన్ని సమతుల్యం చేస్తుంది.
