టెలివిజన్ రంగంలో అతి ముఖ్యమైన టీఆర్పీని తారుమారు చేసిన కేసులో రిపబ్లిక్ టీవీ సీఈవో వికాస్ ఖాంచందానిని ముంబై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిలింద్ భారంభే రిపబ్లిక్ టీవీ సీఈవో అరెస్ట్‌ను ధృవీకరించారు. వికాస్‌ను ఆదివారమే కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్టు కమిషనర్ తెలిపారు. అరెస్టుకు ముందు దర్యాప్తులో భాగంగా వికాస్‌ను రెండుసార్లు ప్రశ్నించారు. ల్యాండింగ్ చానెల్ నంబర్ (ఎల్‌సీఎన్) టెక్నాలజీ ద్వారా కేబుల్ ఆపరేటర్లు టీఆర్పీలను తారుమారు చేసినట్లు క్రైమ్ బ్రాంచ్ విచారణలో తేలింది. ఈ ఎల్సీఎన్ను ఫిక్స్ చేసి, రిపబ్లిక్ టీవీని ప్రమోట్ చేయాలని చానల్ సీఈవో వికాస్ ఖాంచందాని కేబుల్ ఆపరేటర్లను కోరినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. దీనికోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో సీఈవో వికాస్ కూడా ఉన్నట్లు విచారణలో తేలింది.
గత అక్టోబర్ నెలలో ఈ నకిలీ టీఆర్పీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొన్ని టీవీ చానెళ్లు రేటింగ్స్‌ను తారుమారు చేస్తున్నాయంటూ రేటింగ్స్ ఏజెన్సీ బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఫిర్యాదు చేసింది. టీవీ చానెళ్లకు వాణిజ్య ప్రకటనలు రావడంలో టీఆర్పీలే కీలకం. యాడ్స్ కోసం నకిలీ రేటింగ్స్ సృష్టించి ప్రకటనలు ఇచ్చే కంపెనీని ఆకర్షించడానికి కొన్ని టీవీ చానెళ్లు ఇలా నకిలీ టీఆర్పీ స్కామ్‌కు తెరతీశాయి. రేటింగ్ మీటర్లు ఉన్నవారికి లంచాలు ఇచ్చి.. తమ కేవలం తమ చానల్ మాత్రమే చూసేలా రిపబ్లిక్ టీవీ ప్రోత్సహించిందని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రత్యేక బృందం 13 మందిని అరెస్ట్ చేసింది.