ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను ఆస్పత్రికి చేర్చి మరోసారి భారత జవాన్లు మానవత్వం చాటుకున్నారు. గడ్డకట్టే చలిలో, మోకాళ్లలోతు మంచులో జవాన్లు తమ భుజాలపై ఆమెను సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని హాస్పిటల్ కు మోసుకువెళ్లారు. ఆస్పత్రిలో సదరు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతోపాటు తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
కుప్వారాలోని ఫకియాన్ గ్రామానికి చెందిన అహ్మద్ షేక్ భార్య నిండు గర్భవతిగా ఉన్నారు. జనవరి 5 అర్ధరాత్రి అమెకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. బయట మంచు వర్షం.. సమీపంలో ఒక్క వాహనం లేకపోవడంతో అహ్మద్ హృదయ విదారకంగా విలపించడం తెలసుకున్న ఆర్మీ జవాన్లు వైద్య బృందంతో అహ్మద్ ఇంటికి చేరుకున్నారు. అతడి కుటుంబ సభ్యులు వెంటరాగా నలుగురు సైనికులు ఆమెను భుజాలపై మోస్తూ కరాల్పురాలో ఉన్న ఆస్పత్రికి చేర్చారు.
జనవరి 5 కుప్వారాలోని ఫకియాన్ గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను భారత రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో భారత జవాన్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.