ఈ రోజుల్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ చాలాసేపు కూర్చునే ఉండాల్సొస్తుంది. ఇంట్లో కుర్చీ సోఫాలతో మొదలై.. కారు లేదా బండిపై, బస్సు మెట్రో ఎక్కినా.. ఆ తర్వాత ఆఫీస్ కెళ్లినా.. ఇలా ఏది తీసుకున్నా ఎక్కువసేపు కూర్చునే ఉంటాం. అయితే ఇలా ఎక్కువసేపు కూర్చోడానికి మన ఆరోగ్యానికి చాలా లింక్ ఉందంటోంది డబ్ల్యూహెచ్ వో. మనకు వచ్చే జబ్బుల్లో దాదాపు 60శాతం సమస్యలు ఎక్కువగా కదలికలికల్లేని లైఫ్ స్టైల్ వల్లనేనట.
మనలో చాలామంది రోజులో సగటున 10 గంటలు కూర్చునే ఉంటున్నామని సర్వేలు చెప్తున్నాయి. ఇలా ఎక్కువ సేపు కూర్చుంటే ఒకటి కాదు రెండు కాదు చాలానే ఇబ్బందులున్నాయి. అవేంటంటే..

ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల వెన్నెముక మీద ఒత్తిడి పడుతుంది. దాంతోపాటు ఎక్కువ సేపు కూర్చొని ఉండడం వల్ల త్వరగా బరువు కూడా పెరుగుతారు.
కూర్చొని పని చేసేవాళ్లలో గుండె సమస్యలు వచ్చే అవకాశం 53శాతం ఎక్కువ. అంతేకాదు ఎక్కువసేపు కూర్చోడం వల్ల ఆస్టియోపోరోసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది.
రోజువారీ వ్యాయామాలు చేసినా కూర్చోవడం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోలేము. డైట్, వర్కవట్స్ ఇవేవీ కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలను తగ్గించలేవు. చేయాల్సిందల్లా.. కనీసం గంట, రెండు గంటలకొకసారైనా శరీరాన్ని కదిలిస్తుండాలి. లేచి అటు ఇటు నడుస్తుండాలి.