ప్రపంచంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ను స్పేస్‌లోకి పంపి స్పేస్ఎక్స్ ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. కానీ మన హైదరాబాద్‌లో కూడా స్పేస్ఎక్స్ లాంటి ఓ ప్రైవేట్ రాకెట్ స్టార్టప్ ఉందని తెలుసా? రెండేళ్ల క్రితం మొదలైన ఈ స్టార్టప్.. ఇప్పుడు ఆకాశాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉంది.

పవన్‌కుమార్ , నాగ భరత్. రెండున్నరేళ్ల క్రితం స్కై రూట్ అనే ప్రైవేట్ రాకెట్ స్టార్టప్‌ను మొదలుపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా అంతరిక్ష పరిశోధన రంగంలోకి అడుగుపెట్టి.. త్వరలోనే దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ లాంచింగ్‌కు సిద్ధమవుతున్నారు.
ఇస్రో సాయంతో..
ఇస్రోకు చెందిన మాజీ సైంటిస్టులు పవన్‌కుమార్ చందన, నాగభరత్తో పాటు మరికొందరు కలిసి 2018 జూన్ 12న స్కైరూట్ అనే స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా సొంతంగా రాకెట్లను డెవలప్ చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి విక్రమ్-1 అనే రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపి ఉపగ్రహాలను కక్ష్యలోకి పెట్టనున్నట్టు ప్రకటించారు. వీళ్లు ఇంజిన్లు, రాకెట్ల అభివృద్ధి, టెస్టింగ్ కోసం ఇస్రో సహకారం తీసుకుంటున్నారు.

కొత్త టెక్నాలజీతో..
రాకెట్ బరువును తగ్గించడం, తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లేలా చేయడం, వేగంగా రాకెట్లను రెడీ చేయడం స్కైరూట్ ముఖ్య లక్ష్యం. ప్రస్తుతం ఈ సంస్థ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్స్‌ను (ఎస్ఎస్ఎల్వీ) అభివృద్ధి చేస్తుంది. వీటికి విక్రమ్-1, 2, 3 అని పేర్లు పెట్టారు. వీటి పేలోడ్ సామర్థ్యం 525 కిలోల నుంచి 720 కిలోల వరకు ఉంటుంది. వీటికోసం ప్రత్యేకంగా కలాం పేరుతో రాకెట్ ఇంజిన్లను రూపొందిస్తుంది.
ఈ ఏడాది చివరన ప్రయోగించనున్న విక్రమ్-1లో వినియోగించనున్న కలాం-5 ఇంజిన్‌ను ఇటీవలే టెస్ట్ ఫైర్ చేసింది. ఆర్బిట్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ (ఓఏఎం) టెక్నాలజీ సాయంతో ఒకేసారి ఒకటికంటే ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ప్రయత్నిస్తుంది.

బెస్ట్ స్టార్టప్
నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2020లో స్పేస్ కేటగిరీలో స్కైరూట్‌కు బెస్ట్ స్టార్టప్ అవార్డు దక్కింది. స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల దేశంలోని అత్యంత విజయవంతమైన తొమ్మిది స్టార్టప్‌ల యజమానులతో మాట్లాడారు. అందులో స్కైరూట్ ఒకటి.
స్కైరూట్‌లో ప్రస్తుతం 40మందికిపైగా ఇంజినీర్లు పనిచేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి వందమందికిపైగా ఉద్యోగాలు కల్పించామని భవిష్యత్తులో వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతామని నాగభరత్ అన్నారు.