కరోనా కష్టకాలంలో వలస కూలీలను స్వస్థలానికి చేర్చి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసి, పేదలకు అండగా నిలిచి సోనూసూద్ వార్తల్లో హీరో అయ్యాడు. సినిమాల్లో విలన్ పాత్రలు చేసినా.. నిజ జీవితంలో మాత్రం హీరో పాత్రలో జీవిస్తున్నాడు అంటూ సోనూని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయారు.
అరుంధతి సినిమాలో ఈ రియల్ హీరో పోషించిన పశుపతి పాత్ర ఇప్పటికి ఎవరూ మర్చిపోలేరు. అయితే ఈ మధ్యకాలంలో సోనూ సూద్ కి అవకాశాలు తగ్గాయి. మళ్లీ సోనూని తెర మీద చూపించాలని.. పలువురు నిర్మాతలు, దర్శకులు ఆలోచిస్తున్నారు. కాగా ప్రస్తుతం సోనూసూద్.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే కెరీర్ పై సోనూ కీలక ప్రకటన చేశాడు. తాను త్వరలోనే సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపాడు. “నేనే నిర్మాతగా మారబోతున్నా. చర్చలు చివరి దశలో ఉన్నాయి. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు, నేను చేయాలనుకున్న స్క్రిఫ్ట్స్ కోసం చూస్తున్నా. అన్నీ కుదిరితే నటుడిగా, నిర్మాతగా మీ ముందుకొస్తా” అని స్వయంగా సోనూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.