దేశ రాజధాని ఢిల్లీలోకి ఎవరిని.. ఎప్పుడు.. అనుమతించడం, వద్దనడం అనేది పూర్తిగా స్థానిక ప్రభుత్వం, పోలీసుల అధికార పరిధిలో ఉండే అంశమని సుప్రీంకోర్టు తెలిపింది. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రైతులు ఈ నెల 26న సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. అయితే.. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

ఈ విచారణలో గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ అనేది పూర్తిగా శాంతిభద్రతల అంశమని ధర్మాసనం తెలిపింది. పోలీసులు ఏం చేయాలో కోర్టు చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై తదుపరి విచారణ బుధవారానికి వాయిదా వేసింది.
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 26న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి తీరుతామని రైతుసంఘాల నాయకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే జరిగితే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని, ర్యాలీ ఆపేలా ఆదేశాలివ్వాలని కేంద్రం తరఫున ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. మరోవైపు రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ రేపు భేటీ కానుంది.