కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. సమస్య పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపేలా లేదు… వివాదాన్ని పరిష్కరించడం కోసం సుప్రీంకోర్టే చొరవ తీసుకొని కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు తెలిపింది.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన.. జనజీవనానికి ఇబ్బందిగా మారిందని, తక్షణమే రైతులను అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ సుప్రీంకోర్టులో రిషబ్ శర్మ అనే వ్య్తి పిటిషన్ వేశారు. అయితే.. రైతులకు మద్దతు తెలుపూ కూడా భారీగానే పిటిషన్లు వచ్చాయి. ఆయా పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రైతుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘చట్టాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం విశాల దృక్పథంతో చర్చలు జరిపితేనే సఫలమవుతాయని.. లేకపోతే.. ఎన్ని దఫాలుగా చర్చ జరిపినా ఉపయోగం ఉండదు’ అని అభిప్రాయపడింది. రైతులతో కేంద్రం చర్చలు ఫలించేలా కన్పించట్లేదని, త్వరలోనే ఇది జాతీయ సమస్యగా మారే అవకాశముందని జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు పరిధిలో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతు సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులతో ఈ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు సమావేశమై కమిటీలో ఎవరెవరు ఉంటే బాగుంటుందో ఏకాభిప్రాయానికి వచ్చి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది.కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన న్యాయస్థానానికి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆందోళన చేస్తున్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాలకు నోటీసులు జారీ చేసింది. దీనిపై రేపటిలోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. రైతుల ఆందోళనపై అన్ని పిటిషన్లను ఓకేసారి విచారిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.