ఐఎన్ఎస్ విరాట్‌ను ముక్కలు చేయడంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. విరాట్ ని ముక్కలు చేయకుండా స్టే విధించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి విరాట్ ని కొన్న సంస్థకు నోటీసులు జారీ చేసింది. విరాట్‌ను ముక్కలు చేయకుండా దాన్ని ఓ మ్యూజియంగా మార్చి భవిష్యత్ తరాలకు అందించాలని ఓ సంస్థ వేసిన పిటిషన్‌పై సుప్రీం బుధవారం విచారణ జరిపింది.
1959లో హెచ్ఎంఎస్ హెర్మెస్‌గా బ్రిటీష్ రాయల్ నేవీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నౌకను 1986లో ఇండియన్ నేవీ కొనుగోలు చేసి ఐఎన్ఎస్ విరాట్‌గా దీని పేరు మార్చింది. గత 30 ఏండ్లుగా యుద్ధనౌకగా సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్‌ను మూడేండ్ల కిందట సేవల నుంచి తప్పించారు. తుక్కుగా మార్చి అమ్మాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు వేసిన వేలంలో ఓ సంస్థ హక్కులు ఇచ్చింది. అయితే విరాట్ ని మ్యూజియంగా మార్చేందుకు ముంబైకి చెందిన ఎన్విటెక్ మరైన్ కన్సల్టెంట్స్, మహారాష్ట్ర, ఏపీ, గోవా ప్రభుత్వాలు ముందుకు వచ్చి రక్షణ శాఖకు లేఖలు కూడా రాశాయి.