పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో రైతులు సాగిస్తున్న ఆందోళనపై సుప్రీంకోర్టు ఇయ్యాల విచారణ చేపట్టనుంది. ఇదే అంశం మీద బుధవారం విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం సాగు చట్టాల రద్దు విషయంలో రైతు సంఘాలు, కేంద్ర మధ్య ఫలు దఫాలుగా చర్చలు జరిగినా ప్రతిష్టంభన కొనసాగటం పట్ల అసహనం వ్యక్తం చేసింది. వివాదాన్ని పరిష్కారించడానికి కమిటీ వేయాలని భావిస్తున్నట్లు చెప్పిన న్యాయస్థానం ‘ఢిల్లీ రహదారుల దిగ్బంధం’ పిటిషన్లపై నేడు విచారణ జరుపనుంది.
ఢిల్లీకి వచ్చే రోడ్లలో రైతులు బైఠాయించడం వల్ల రాకపోకలు నిలిచిపోయి సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, వెంటనే వారికి అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన రిషబ్ శర్మ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. దీంతో సుప్రీం ఏం చెబుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు చట్టాల రద్దు డిమాండ్‌తో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 22వ రోజుకు చేరింది. ఢిల్లీ-హర్యాణా సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ వద్ద వేలాది మంది రైతులు బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు.