తమిళ చిన్నమ్మ శశికళ విడుదల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిన్నమ్మ విడుదల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆమె విడుదల రోజు భారీగా స్వాగతం పలికేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.
త్వరలో తమిళనాడు ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు మాజీ సీఎం, పురచ్చి తలైవి దివంగత జయలలిత నెచ్చెలిగా రాష్ట్రంలో సుపరిచితమైన చిన్నమ్మ శశికళ ఎప్పుడు విడుదలవుతారా అనేది ఆసక్తిగా మారింది. శశికళ విడుదల కాగానే..తమిళనాట రాజకీయాలు వేడెక్కడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు. శశికళ బయటకు వస్తే.. జరిగే రాజకీయ పరిణామాలపై అధికారపార్టీ ఏఐఏడీఎంకే ముఖ్య నేతలు ఆందోళన చెందుతున్నారు.
జనవరి 27న జైలు జీవితం నుంచి విముక్తి పొందడం ఖాయమనే వార్తలు ప్రచారంలో ఉన్న క్రమంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ( AMMK ) వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. అక్రమార్జన కేసులో జైల్లో ఉన్న ఆమె శిక్షాకాలం జనవరి 26న ముగియనుంది. శిక్షాకాలం కంటే ముందుగానే విడుదలవుతారని తొలుత ప్రచారం జరిగినా..సాధ్యం కాలేదు. ముందస్తు విడుదల కోసం శశికళ చేసిన విజ్ఞప్తిని జైళ్లశాఖ పరిశీలనలో ఉంచింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె నేరుగా మెరీనా బీచ్ లోని జయలలిత సమాధికి చేరుకుని శపధం చేస్తారని అభిమానులు చెబుతున్నారు. ఆమె వచ్చే మార్గంలో 65 చోట్ల ఆహ్వాన ద్వారాలు, స్వాగత తోరణాలు ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు.