మునుపెన్నడూ భారత్ ఉపయోగించని మోడర్న్ టెక్నాలజీ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెంతకు చేరింది. భారత వాయుసేనను మరింత పటిష్ఠపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 48వేల కోట్ల విలువైన 83 తేజస్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఓకే చెప్పింది. ప్రధాని నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కమిటీ(సీసీఎస్) దీనికి ఆమోదం తెలిపింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలిపారు. ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు అని ట్వీటారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ నిర్ణయం ఊతంగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సాయుధ బలగాల సామర్థ్యాన్ని ఈ కొనుగోలు బలపరుస్తుందని ఆయన ట్విట్టర్లో అన్నారు. డిఫెన్స్ రంగంలో ఇది అతిపెద్ద దేశీయ కొనుగోలు కావడం విశేషం. ఇప్పటివరకు లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, తేజస్- మార్క్ 1ఏ లాంటి తేలికపాటి యుద్ధవిమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది. అయితే ఇప్పుడు ఉన్న యుద్ధవిమానాల కంటే తేజస్ ఎన్నోరెట్లు మెరుగైనది.
ఇదిలా ఉండగా.. మరోపక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తో భారత ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు(ఎంఓఈఎస్)కు ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం వాతావరణ, భూకంప, మహాసముద్రాల విపత్తుల సమాచారాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుంది.