కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం హర్యాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎట్టిపరిస్థితుల్లో ఆటంకం తలెత్తకుండా చూడాలని పోలీస్ డిప్యూటీ కమిషనర్లు, కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, సోన్‌పట్, పాల్వాల్, ఝజ్జర్ జిల్లాల్లో బుధవారం సాయంత్రం 5గంటల వరకు ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసుల రద్దు కొనసాగుతుందని హర్యాణా ప్రభుత్వం స్పష్టంచేసింది.
పంజాబ్‌లోనూ సీఎం అమరీందర్ సింగ్ హై అలర్ట్ ప్రకటించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం రాకుండా చూడాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. రైతులంతా తక్షణమే ఢిల్లీ ఖాళీ చేసి బార్డర్ వద్దకు తిరిగి రావాలని సీఎం అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో షాకింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయని, ఈ ఉద్యమంలో కొన్ని శక్తులు హింసకు పాల్పడటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలాంటి ఘటనలు శాంతియుత పోరాటాల పట్ల ఉన్న మంచి ఉద్దేశాన్ని దెబ్బతీస్తాయన్నారు. ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న రైతులంతా తిరిగి నిరసన స్థావరాలకు చేరుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) విజ్ఞప్తి చేసింది. రైతుల ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించింది. త్వరలోనే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని కిసాన్ సంఘం నేతలు తెలిపారు.