కరోనా టీకాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై కేంద్రం స్పందించింది. ఇకపై ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది. వ్యాక్సిన్ పై వదంతులు వ్యాపించే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐపీసీ చట్టాల కింద కేసులను నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చెప్పారు. వ్యాక్సిన్ పై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇస్తున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు సురక్షితమైనవని హోంశాఖ కార్యదర్శి భల్లా మరోసారి స్పష్టం చేశారు.